
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత్ క్రికెట్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలు(ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్)లు నెగ్గిన తొలి కెప్టెన్. బ్యాట్స్‌మెన్‌గానే కాదు వికెట్ కీపర్‌గా ధోని ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.
టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈరోజు సెప్టెంబర్ 14. ధోనీకి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌తో ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అడుగుపెట్టాడు.
సఫారీ గడ్డపై ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా తన తొలి మ్యాచ్‌ని పాకిస్థాన్‌తో తలపడింది. అయితే, అంతకుముందు స్కాట్లాండ్‌తో మ్యాచ్ జరగాల్సి ఉన్నా అది వర్షం కారణంగా రద్దైంది. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్ ధోనీకి కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో బౌల్ ఔట్ పద్ధతి ద్వారా భారత్ నెగ్గింది.
ధోని నాయకత్వంలోని టీమిండియా ఆరంభ సీజన్ టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14వ తేదీ ధోని కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన రోజు కావడంతో ధోని అభిమానులు '12YearsOfCaptainDhoni' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. 'భారత్ క్రికెట్ ముఖ చిత్రాన్నే మార్చిన క్రికెటర్ ధోని' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ 'నువ్వు కెప్టెన్లకే కెప్టెన్' అంటూ ట్వీట్ చేశాడు. 'భారత్ గెలిచినప్పుడు అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడ్ని మీడియా ముందకు పంపే ధోని.. ఓటమి పాలైనప్పుడు మాత్రం అందుకు పూర్తి బాధ్యత వహించడం మాలో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది' అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.