తెలంగాణ యువ క్రికెటర్లకు శుభవార్త. ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) మళ్లీ వచ్చేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు.
త్వరలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తామని వెల్లడించిన జగన్మోహన్ రావు... క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు రూ.కోటి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

టీపీఎల్ నిర్వహణ, ఆటగాళ్ల శిక్షణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా రాణిస్తోన్న తెలంగాణ క్రికెటర్లను వచ్చే నెలలో హెచ్‌సీఏ అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తాం అని పేర్కొన్నారు.
బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరించి, మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, చివరి సారిగా 2018లో టీపీఎల్ నిర్వహించారు. తిలక్ వర్మ కూడా ఈ లీగ్‌తోనే వెలుగులోకి వచ్చాడు.