న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెచ్‌సీఏ‌లో మరో అలజడి.. ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌పైనే వేటు.!

HCA apex council issues showcause notice to president Mohammad Azharuddin

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో మరో అలజడి. నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అసోసియేషన్‌ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అజారుద్దీ‌న్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా...అందుకు ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

 షోకాజ్ నోటీస్..

షోకాజ్ నోటీస్..

యూఏఈలో జరిగిన అనధికారిక టీ10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్‌ నియామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌... ఇకపై అసోసియేషన్‌ కార్యకలాపాల్లో అజారుద్దీన్ పాల్గొనరాదని నిషేధం విధించింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ‌లకు సంయుక్తంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు.

అజార్ తప్పులపై..

అజార్ తప్పులపై..

'హెచ్‌సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు పిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరిపేందుకు జూన్ 10న అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. అజార్‌పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ గుర్తించని టీ10 లీగ్‌లో పాల్గొంటున్న ఈ క్లబ్‌కు అజార్ మెంటార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దమే కాకుండా పరస్పర విరుద్ద ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్దారించింది.హెచ్‌సీఏకు దిల్‌సుక్‌నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలను గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. న్యాయ పరంగా ఈ విషయాలపై పూర్తి విచారణ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ సస్పెన్షన్‌లోనే ఉంటాడని పేర్కొన్నది.'అని హెచ్‌సీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.

 రిటైర్మెంట్ రగడ..

రిటైర్మెంట్ రగడ..

హెచ్‌సీఏ రూల్ నెంబర్ 38(1)(3) ప్రకారం ఒక అనధికార లీగ్‌లోని క్లబ్‌కు మెంటార్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘించాడు. ఇక అజారుద్దీన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదనేది మరో ఆరోపణ. 2019 డిసెంబర్ 14న హెచ్‌సీఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను చివరి మ్యాచ్ ఆడిన 2000 మార్చి 6నే రిటైర్ అయినట్లు పరిగణించాలని కోరాడు. అదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. అంటే 19 ఏళ్ల పాటు తన రిటైర్మెంట్ గురించి చెప్పని అజారుద్దీన్.. అకస్మాత్తుగా 2019లో కేవలం ఒక లేఖ ద్వారా అప్పుడే రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డులో గానీ, అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో గానీ పదవి చేపట్టాలంటే క్రికెటర్లు రిటైర్ అయిన 5 ఏళ్ల తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. అయితే కీలకమైన హెచ్‌సీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

పట్టించుకోని బీసీసీఐ

పట్టించుకోని బీసీసీఐ

గత కొంత కాలంగా అజారుద్దీన్‌కు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. ఈ వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్‌ కౌన్సిల్‌ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజారుద్దీన్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజారుద్దీన్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, June 17, 2021, 8:30 [IST]
Other articles published on Jun 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X