
స్పిన్ ద్వయం..పేస్ త్రయం ఫటాఫట్!
ఇప్పటిదాకా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా బౌలింగ్ విభాగంపై ఈ రేంజ్‌లో దాడి చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. హేమాహేమీలుగా ముద్రపడిన క్రిస్ గేల్ గానీ, డేవిడ్ వార్నర్ గానీ, బాబర్ ఆజమ్ గానీ, ఫాప్ డుఫ్లెసిస్ గానీ..వీరంతా టీమిండియా బౌలింగ్ బాధితులే. భారీ పరుగులు చేయలేక వికెట్లను సమర్పించుకున్న ఆటగాళ్లే. అలాంటిది- బెయిర్ స్టో చేసి చూపించాడు. టీమిండియా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో నిరూపించాడు. టీమిండియా అమ్ములపొదిలో ప్రధాన అస్త్రాలైన స్పిన్ ద్వయాన్ని, పేస్ త్రయాన్ని ఇలా ఆడాలని మిగిలిన బ్యాట్స్‌మెన్లను పటాఫట్ ఆడించేశాడు.

అలా..? ఎలా..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అభిమానులు, టీమిండియాను సైతం కొరుకుడు పడని ప్రశ్న ఒక్కటే. బెయిర్‌స్టో గానీ, మరో ఓపెనర్ జేసన్ రాయ్ గానీ, మిడిలార్డర్‌లో వచ్చిన జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్.. ఎలా ఇంత దూకుడు ప్రదర్శించారనేది ఇప్పుడు ప్రశ్నార్థకమై కూర్చుంది. మొత్తం 50 ఓవర్లలో 337 పరుగులను అలా ఎలా పిండేసుకుంటారు? స‌్పిన్ సరే.. పేస్ బౌలింగ్‌నూ ఎలా ఆడారనేది ఆలోచించడానికి పెద్దగా తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి ప్రధాన కారణం- ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆలియాస్ ఐపీఎల్‌లో ఆడిన అనుభవం.

ఇదంతా ఐపీఎల్ పుణ్యమే!
టీమిండియా బౌలింగ్ ఎలాంటిదో? స్పిన్నర్లు గానీ, ఫాస్ట్ బౌలర్లు గానీ ఎలాంటి బంతులు వేస్తారో? ఎక్కడ పిచ్ అయ్యేలా వాటిని సంధిస్తారు? ఒత్తిడిలో ఎలా రాణిస్తారు? బ‌్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలను రచిస్తారు? అనేది ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లకు కొట్టిన పిండి. బెయిర్ స్టో, బెన్‌స్టోక్స్, బట్లర్.. ఈ ముగ్గురికీ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ ఏడాది ముగిసి సీజన్‌లో ఈ ముగ్గురూ ఎలా ఆడారో మనం చూశాం. వారి బ్యాటింగ్‌ను చూసి కేరింతలు కొట్టాం. ఆ అనుభవమే ఇప్పుడు కొంప ముంచింది. హైదరాబాద్ సన్‌రైజర్స్ తరఫున బెయిర్‌స్టో ఆడాడు. బెన్‌స్టోక్స్, బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు.

వీవీఎస్ లక్షణ్ శిక్షణ..
హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున బెయిర్ స్టో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే తోటి ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి సెంచరీ చేశాడతను. అదే అనుభవం ఇక్కడ పనికి వచ్చింది. అన్నింటికీ మించి- హైదరాబాద్ సన్‌రైజర్స్ మెంటార్‌గా పనిచేస్తోన్న హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర బెయిర్ స్టో కిటుకులు నేర్చుకున్నాడు.

ఐపీఎల్‌లోనే బలహీనతలు కనిపెట్టాడా?
ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున యజువేంద్ర చాహల్‌ల స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలో? వారి బలహీనతలేమిటో అప్పట్లో వీవీఎస్ లక్ష్మణ్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. శిక్షణ పొందాడు. దాన్ని ఇక్కడ ప్రయోగించాడు బెయిర్‌స్టో. మ్యాచ్ ముగిసిన అనంతరం బెయిర్‌స్టో స్వయంగా దీని గురించి చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తాను రాణించడానికి ఐపీఎల్ సహకరించిందని, దానికంటే ముఖ్యంగా హైదరాబాద్ సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ నేర్పించిన చిట్కాలు ఉపయోగపడ్డాయని గర్వంగా చెప్పుకొన్నాడు. లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.


Click it and Unblock the Notifications












