హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ టెస్టు మ్యాచ్ నిర్వహణను సాఫీగా జరిపే బాధ్యతలను బోర్డు జనరల్ మేనేజర్ (గేమ్స్ డెవల్‌పమెంట్) రత్నాకర్ శెట్టికి అప్పగించింది.
ఈ విషయాన్ని రత్నాకర్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ బేరర్లు పని చేస్తుండగా, ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించకుండా హైకోర్టు నిలిపేసింది. దీంతో పాటు హెచ్‌సీఏ వద్ద తగిన నిధులు లేకపోవడం కూడా బోర్డుకు మరింత భారంగా మారింది.

ఈ నేపథ్యంలో బోర్డు జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్‌మెంట్) రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీతో రత్నాకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. 'టెస్ట్ మ్యాచ్‌ను సాఫీగా నిర్వహించే విధంగా సమన్వయం చేయడం కోసమే ఈ అపాయింట్‌మెంట్' అని శెట్టి చెప్పాడు.
ఈ నిర్ణయాన్ని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి తీసుకున్నారు. అయితే పరిస్థితులను బట్టి అవసరమైతే టెస్టును హైదరాబాద్ నుంచి తరలించే అధికారాన్ని కూడా శెట్టికి అప్పగించడం విశేషం. తమ వద్ద నిధులు లేవంటూ ఇటీవలే హెచ్‌సీఏ బీసీసీఐకి లేఖ రాయడంతో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తాయి.
ఆ తర్వాత హెచ్‌సీఏ తాము బోర్డుకు ఎటువంటి లేఖ రాయలేదని బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు సిద్ధమంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.