టీమిండియా విజయోత్సవ ర్యాలీ ఘనంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య, పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలివెళ్లారు. టీ20 వరల్డ్ కప్‌తో రోహిత్ సేన భారత గడ్డపై అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణం నెలకొంది. భారత జట్టుకు చరిత్రలో నిలిచేలా ఘన స్వాగతం లభించింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ బృందానికి అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు.
బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో భారత ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు వెళ్లారు.విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అక్కడకి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో మెరైన్‌డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. భారత ఆటగాళ్లు కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు.

వేలాది అభిమానుల మధ్య టీమిండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడేలో భారత ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్ అందజేసింది. అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అయితే వాంఖడేలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ మాట్లాడానికి ప్రారంభించగా.. అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లింది. అందరికీ థ్యాంక్స్ చెబుతూ హిట్‌మ్యాన్ మాట్లాడాడు.
''ఇండియాకు తిరిగివచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది. మాకు దక్కిన అపూర్వ స్వాగతం, జనసందోహం చూస్తుంటే మాలాగే ప్రపంచకప్ కోసం మీరంతా ఎంతగా ఆరటపడ్డారో, టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. ఈ వరల్డ్ కప్ దేశానిది. జట్టుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఎంతో గౌరవంగా ఉంది''
''వరల్డ్ కప్‌ను సెలబ్రేట్ చేయడంలో ముంబై ఎప్పటికీ నిరాశపరచదు. ఘనస్వాగతం దక్కింది. మాతో పాటు ట్రోఫీ కోసం ఎదరుచూసిన అభిమానులకు, దేశానికి టీమిండియా, బీసీసీఐ తరఫున ధన్యవాదాలు చెబుతున్నా. ఇక ఈ టీమ్ ఎంతో స్పెషల్. ఈ జట్టుకు సారథ్యం వహించడం అదృష్టం. ఫైనల్‌లో హార్దిక్ పాండ్య ఫైనల్ ఓవర్ బౌలింగ్ వేశాడు. హార్దిక్‌కు హ్యాట్సాఫ్. చివరి ఓవర్‌లో ఎన్ని పరుగులు డిఫెండ్ చేయాల్సి వచ్చినా, బౌలర్‌పై తీవ్ర ఒత్తిడితో ఉంటుంది. హార్దిక్ సత్తాచాటాడు'' అని రోహిత్ శర్మ అన్నాడు.
రోహిత్ అలా చెప్పడంతో వాంఖడే స్టేడియం హార్దిక్ నామస్మరణతో దద్దరిల్లింది. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడంతో హార్దిక్ గతంలో అభిమానుల నుంచి హేళనకు గురైన విషయం తెలిసిందే. కానీ అదే అభిమానులు ఇప్పడు హార్దిక్‌ను కొనియాడటం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ ఆల్‌రౌండ్ షోతో జట్టుకు విజయాలు అందించాడు.