హైదరాబాద్: సంప్రదాయ క్రికెటర్లు బ్యాట్స్‌మెన్‌గా సక్సెస్ కావడానికి టీ20 ఫార్మాట్ అనేది ఎంతగానో దోహదపడుతుందని కింగ్స్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు హషీం ఆమ్లా అభిప్రాయపడ్డాడు. పెద్దగా హిట్టింగ్ చేయని తనలాంటి బ్యాట్స్‌మెన్‌ను కచ్చితమైన క్రికెటింగ్ షాట్ల ద్వారా టీ20ల్లో భారీ పరుగులు సాధించేలా చేస్తోందని చెప్పాడు.
'టీ20 క్రికెట్ ఆడే బ్యాట్స్‌మెనంతా ఎదుర్కొనే ప్రతి బంతికీ ఎక్కువ పరుగులెలా రాబట్టాలనే ఆలోచిస్తారు. ట్వంటీ 20 ఫార్మాట్ క్రికెట్ ద్వారా ప్రతీ బంతిని ఎదుర్కోవడం తెలియాలి. సంప్రదాయ షాట్లు ఆడకుండా టీ20ల్లో విజయవంతమైన ఉత్తమ క్రికెటర్లెందరో ఇదే విషయం చెప్పారు. దాదాపు 10 ఏళ్ల ఈ ఫార్మాట్‌ను పరిశీలిస్తే అనేక మంది విజయవంతమైన క్రికెటర్లు ఉన్నారు' అని ఆమ్లా అన్నాడు.

'ఈ ఫార్మాట్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మందికి తొలుత భారీ హిట్టింగ్ అనేది తెలియకపోవచ్చు. ఇక్కడకు వచ్చిన తర్వాత మంచి క్రికెటింగ్ షాట్లు ఆడి పరుగులు రాబట్టారు. ఆ రకంగా బ్యాట్స్ మెన్ సక్సెస్‌కు ఐపీఎల్ కానీ, ట్వంటీ 20 క్రికెట్ కానీ ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం' అని ఆమ్లా తెలిపాడు.
మరోవైపు అంతర్జాతీయ టీ20 క్రికెట్, పదేళ్ల ఐపీఎల్‌ను చూస్తే భారీ సిక్సర్లు కొట్టగల హిట్టర్‌గా తెలియని వారే పరుగులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలాంటి అద్భుత అవకాశాలు కల్పిస్తోందని ఆమ్లా చెప్పాడు. టెస్టు క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్లా ఐపీఎల్ పదో సీజన్‌లో రెండు సెంచరీలు సాధించాడు.
ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు హషీం ఆమ్లా మరో సెంచరీని నమోదు చేశాడు. 60 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకముందు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆమ్లా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఆమ్లా సెంచరీ చేసిన రెండు సందర్భాల్లో పంజాబ్ జట్టు విజయం సాధించలేదు. అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో ఆమ్లా సెంచరీ వృధాగా పోయింది. ఇక, అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా సెంచరీ సాధించాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.