అరుదైన ఘనత, చివరి వ్యక్తి ఆమ్లానే: డుప్లెసిస్ ప్రశంస
హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా గురువారం అరుదైన మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు తరుపున వందో టెస్టు మ్యాచ్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్‌గా జట్టుకు మూలస్థంభంలా నిలిచిన ఆమ్లా తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నాడు.
జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా గురువారం నుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఆమ్లాకు 100వ టెస్టు మ్యాచ్ కావడ విశేషం. ఈ సందర్భంగా ఆమ్లాపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు.
తన వందో టెస్టుతో ఫామ్‌లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన డు ప్లెసిస్ 'బహుశా దక్షిణాఫ్రికా తరఫున వంద టెస్టులు ఆడబోయే చివరి వ్యక్తి ఆమ్లానే' అని సహచరుడిని ప్రశంసించాడు. వందో టెస్టు ఆడటం నిజంగా గొప్ప అనుభూతి అని చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో టెస్టు క్రికెట్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయని అన్నాడు.
అయితే జట్టులో యువ ఆటగాళ్లు అయిన డీకాక్, రబడ రాబోయే రోజుల్లో కూడా రాణిస్తే ఈ వంద టెస్టు మ్యాచ్‌ల మార్కుని అందుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఏబీ డివిలియర్స్, జాక్వస్ కల్లిస్, గ్రేమ్ స్మిత్‌ల తర్వాత ఈ మధ్య కాలంలో దక్షిణాఫ్రికా తరుపున వంద టెస్టుల మార్కుని అందుకున్న ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు.

ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా
మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలుస్తాడు. 2004 డిసెంబర్‌లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఆమ్లా, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు.

25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు
ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్ సెంచరీ హషీమ్ ఆమ్లా పేరిట ఉండటం గమనార్హం. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు చేశాడు.

రెండేళ్ల పాటు జట్టుకు దూరం
ఇలా 15 టెస్టుల తర్వాత కూడా ఆమ్లా యావరేజి 25.50గా ఉంది. దీంతో జట్టుకు రెండేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న తర్వాత తన ఆటతీరుతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు.

మత విశ్వాసాలను సైతం పాటిస్తాడు
ఆమ్లా వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. మత విశ్వాసాలను పాటించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు జెర్సీపై లిక్కర్ కంపెనీ బ్రాండ్‌ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. ఒకానొక సందర్భంలో అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్ డీన్‌జోన్స్ ‘టెర్రరిస్ట్' అని సంబోధించాడు.

తనపై విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం
అయితే ఆమ్లా మాత్రం వీటన్నింటినీ పట్టించుకోలేదు. తనపై విమర్శలు చేసిన వారికి తన ఆటతీరుతోనే సమాధానమిచ్చాడు. వివాదాలకు ఎప్పడూ దూరంగా ఉంటాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా... శ్రీలంకను వైట్ వాష్‌పై చేయాలని భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications