
లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా దూకుడు ఎలా కొనసాగుతున్నదో మనం చూస్తున్నాం. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోతోంది కోహ్లీసేన. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఖంగు తినిపించింది. పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది. దక్షిణాఫ్రికా వెన్ను విరిచింది. న్యూజీలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ప్రధాన జట్లన్నీ భారత్ చేతిలో పరాభవాన్ని చవి చూసినవే.. ఒక్క ఇంగ్లండ్ తప్ప! ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రధాన జట్లు పోగా.. వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్ ఆడాల్సి ఉంది టీమిండియా.
ఇంగ్లండ్, వెస్టిండీస్ మినహాయిస్తే.. మిగిలిన జట్లతో మ్యాచ్‌లన్నీ దాదాపుగా వన్‌సైడ్‌గా మారిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా- ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. ఇదిలావుండగా.. ప్రపంచకప్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంటుందని అంటూ పాకిస్తాన్ పేస్ బౌలర్ హసన్ అలీ జోస్యం చెప్పారు. భారత మహిళా జర్నలిస్ట్ ఒకరు చేసిన ట్వీట్‌కు హసన్ అలీ సమాధానం ఇచ్చారు. ముందస్తుగా శుభాకాంక్షలు కూడా చెప్పేశాడు.

ముంతాజ్ అనే ఓ మహిళా విలేకరి.. కొద్దిరోజుల కిందట ఓ ట్వీట్ చేశారు. మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన వెంటనే ఆమె టీమిండియాకు కంగ్రాట్స్ చేబుతూ చేసిన ట్వీట్ అది. ఇదే దూకుడును కొనసాగించాలని, ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని ఆమె అభిలాషించారు. దీనికి హసన్ అలీ బదులిచ్చారు. మీ కోరిక నెరవేరుతుంది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశాడు. అనంతరం దాన్ని డిలిట్ చేశాడు. మాంఛెస్టర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హసన్ అలీ.. భారీగా పరుగులను ఇచ్చుకున్నాడు. పదిఓవర్లలో 84 పరుగులను సమర్పించేసుకున్నాడు.