టీమిండియాలో సుడిగాడు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడెందుకు జట్టులో ఎందుకు ఒంటరి వాడయ్యాడు. ఒకానొక దశలో జట్టులో అన్నీ తానై నడిపించిన ధోని ఇప్పుడు ఎందుకు ఒంటరి వాడయ్యాడు.
అసలు టీమిండియాలో ధోని శకం 2011 నుంచి ప్రారంభమైంది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై ప్రాంఛైజీలో ధోని భాగస్వామ్యం ఏర్పడ్డాక ఇద్దరి మధ్య బంధం మరింతగా బలపడింది. మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా ఉన్న ధోని ఏది చెబితే అది బీసీసీఐ వినేవారు.

ఇలా టీమిండియాను కొన్నాళ్ల పాటు ధోని ఏలారు. ఇంతలో బీసీసీఐకి అనుబంధంగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫిక్సింగ్ ఆరోపణలు, అవినీతి బయటపడింది. అదీ ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బీసీసీఐకి దూరమైన దాల్మియా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ధోని సుడి ఒక్కసారిగా మారిపోయింది. శ్రీనివాసన్‌తో వ్యక్తిగత, వ్యాపార సంబంధం ఉన్న ధోనిని కూడా బీసీసీఐ మెల్లగా పక్కకు పెట్టసాగింది.
ఆస్టేలియా పర్యటనలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. సెలక్టర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. మరోవైపు అప్పటి వరకు ధోనికి సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లు కూడా కోహ్లీ వైపు వెళ్లారు.
ఇటీవల ముగిసిన శ్రీలంక టెస్టు సిరిస్‌లో 2-1 తేడాతో టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఒకవేళ కోహ్లీ విఫలమైతే ఆదుకునేందుకు రిజర్వులో సెలక్టర్లు రహానే ఎంచుకున్నారు. దీంతో ధోనీ ఒంటరయ్యాడు. ఆటగాళ్లలో, అభిమానుల్లో ధోనీ ప్రాభవానికి లోటులేనప్పటికీ బీసీసీఐలో మాత్రం ధోనీకి గతంలో ఉన్నంత గుర్తింపు లేదనేది వాస్తవం.