అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్లు సత్తాచాటలేకపోయారు. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాకు తోడుగా సిరాజ్ ఫర్వాలేదనిపించాడు.
స్పిన్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. ఇక యువ పేసర్ హర్షిత్ రాణా నిరాశపరిచాడు. ఒక్క వికెట్ సాధించలేకపోయాడు. అంతేగాక రెండు సార్లు డకౌటయ్యాడు. బంతితో పాటు కీలక పరుగుల చేసే సామర్థ్యంతో తుదిజట్టులోకి వచ్చిన 22 ఏళ్ల హర్షిత్ రాణా విఫలమవ్వడంతో నెట్టింట్లో అతనిపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా తండ్రి ప్రదీప్ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తన బిడ్డ హర్షిత్ రాణాను ఓ బౌలర్‌గా తాను భావించాలంటే, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాలని ప్రదీప్ అన్నారు. అలా చేస్తే భారత జట్టు నుంచి తన కుమారుడిని ఎవరూ తప్పించలేరని చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ''150 కి.మీ/గంట వేగంతో బౌలింగ్ చేయాలని హర్షిత్ రాణాకు సవాలు విసిరాను. ఆ వేగాన్ని అందుకోకపోతే బౌలర్‌గా పరిగణించనని చెప్పా. ఆ మార్క్ అందుకుంటే భారత్ తరఫున ఆడకుండా ఎవరూ అడ్డుకోలేరు. అదే 125 కి.మీ/గంట వేగంతో బౌలింగ్ చేస్తే లోకల్ క్లబ్‌లో కూడా బౌలర్‌గా ఎంపిక చేయరు'' అని ప్రదీప్ అన్నారు.
కాగా, రెండో టెస్టు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హర్షిత్ రాణాకు అండగా నిలిచాడు. తొలి టెస్టులో రాణా సత్తాచాటాడని, రెండో టెస్టులో నాణ్యమైన బ్యాటర్ ట్రావిస్ హెడ్ కారణంగానే ఒత్తిడికి గురయ్యాడని యువ పేసర్‌కు హిట్ మ్యాన్ మద్దతు ఇచ్చాడు. పెర్త్ టెస్టులో రాణా బాగా ఆడాడని, జట్టుకు అవసరమైన స్థితిలో రాణించాడని చెప్పాడు. ఓ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి మరో మ్యాచ్‌లో పక్కనపెట్టడం ప్లేయర్‌కే కాదు, జట్టుకు మంచిది కాదని రోహిత్ పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టులో రాణా 16 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 5.40 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు.