
హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కోచ్‌ల పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
కోచ్‌ల దరఖాస్తులకు తుది గడువుని జులై 30, సాయంత్రం ఐదు గంటలుగా బీసీసీఐ నిర్ణయించింది. కోచ్ ఎంపికపై దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కోహ్లీ ఇలా మాట్లాడటం తగదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
"ఇది మంచి ఐడియా కాదు. దరఖాస్తులకు ఆహ్వానించిన అందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుండగానే హెడ్ కోచ్ ఎంపికలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తులు ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం తగదు" అని భోగ్లే ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
మీడియా సమావేశంలో కోహ్లీ ఏం మాట్లాడంటే!
"హెడ్ కోచ్ విషయంపై క్రికెట్ సలహా కమిటీ నన్ను సంప్రదించలేదు. రవి భాయ్‌తో మా అందరికీ మంచి బంధం ఉంది. అతడినే కోచ్‌గా కొనసాగిస్తే చాలా సంతోషిస్తాం. కానీ కోచ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)నే. ఈ విషయంపై సీఏసీ ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు. నా అభిప్రాయం అడిగితే చెబుతా" అని కోహ్లీ అన్నాడు.
కాగా, మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న అన్షుమన్ గైక్వాడ్ కూడా రవిశాస్త్రికే మద్దతు పలికాడు. రవిశాస్త్రినే మళ్లీ నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా మండలి (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న అన్షుమన్ గైక్వాడ్ తెలిపాడు. అంతేకాదు కోచ్‌గా రవిశాస్త్రిని మార్చాల్సిన అవసరం లేదని గైక్వాడ్ చూచాయిగా చెప్పేశాడు.
మరో వ్యాఖ్యాత ఆకాశ్ చోఫ్రా తన ట్విట్టర్లో "కెప్టెన్ తన ప్రాధాన్యతని వినిపించాడు. CAC సభ్యులలో ఒకరు సైతం టీమిండియ హెడ్ కోచ్ పదవిపై ఇలానే వ్యాఖ్యానించారు. ఇప్పటికీ దరఖాస్తు చేస్తున్న లేదా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ లక్" అంటూ ట్వీట్ చేశాడు. ఈ రెండు ఘటనలను కోడ్ చేస్తూ హర్షా భోగ్లే ట్వీటర్ వేదికగా స్పందించాడు.
కాగా, టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు మహేళా జయవర్దనేతో పాటు గ్యారీ కిర్‌స్టన్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 13 లేదా 14న హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. అయితే, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే ఎంపిక చేసే అవకాశం ఉంది.