కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. అయిదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసి ఓడిన ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటింది. ఉత్కంఠగా సాగిన మూడో టీ20లో 223 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించి రికార్డు సృష్టించింది. హ్యారీ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండస్ 1-2తో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా సహచర ఆటగాళ్లతో నికోలస్ పూరన్ (85; 45 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. పావెల్ (39), రూథర్‌ఫోర్డ్ (29), షై హోప్ (26), హోల్డర్ (18*) పరుగులు చేశారు.సామ్ కరన్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు, మొయిన్, టోప్లీ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు సాల్ట్ (109; 56 బంతుల్లో) సెంచరీతో, బట్లర్ (51; 34 బంతుల్లో) హాఫ్ సెంచరీతో చెలరేగారు. లివింగ్ స్టోన్ (30) ఫర్వాలేదనిపించాడు.అయితే ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు చేయాలి. ఆ టైమ్ లో స్ట్రైక్‌లో హ్యారీ బ్రూక్ (31*; 7 బంతుల్లో) ఉండగా మరో ఎండ్‌లో సాల్ట్ ఉన్నాడు.
అయితే చివరి ఓవర్ వేసిన రసెల్ బౌలింగ్‌లో బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. తొలి బంతిని బౌండరీకి తరలించిన బ్రూక్ తర్వాత రెండు బంతుల్ని సిక్సర్లగా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, అయిదో బంతికి భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు.వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన స్కోరు.
కాగా, ఈ ఇన్నింగ్స్‌తో బ్రూక్ ఫ్రాంచైజీల దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. హ్యారీ బ్రూక్ తన కనీస ధర రూ.2 కోట్లుగా వేలంలో పాల్గొంటున్నాడు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనున్న వేలానికి 333 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్న ఆటగాళ్లు 23 మంది ఉన్నారు. వీరిలో భారత ప్లేయర్లు హర్షల్ పటేల్,శార్దూల్ ఠాకూర్,ఉమేశ్ యాదవ్. మిగిలిన వారందరూ విదేశీ ప్లేయర్లే.