Harry Brook: ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు వన్డేలు, టీ20ల్లో సారథ్య బాధ్యతలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అప్పగిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్‌ను వైట్ బాల్(పరిమిత ఓవర్ల క్రికెట్) కెప్టెన్‌గా నియమించారు. హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నాటి నుంచే ఇంగ్లండ్ భవిష్యత్ కెప్టెన్ గా ముందుకు సాగాడు. హ్యారీ బ్రూక్ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2024లోనే జోస్ బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడని తెలిసిందే.2024లో ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ వన్డేలకు జోస్ బట్లర్ లేనప్పుడు జట్టుకు నాయకత్వం వహించాడు.
కెప్టెన్ అయిన తర్వాత హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. చిన్నప్పుడు బర్లీ వార్పెడేల్‌లో క్రికెట్ ఆడుతున్న నాటి నుంచి యార్క్ షైర్ కు ప్రాతినిధ్యం వహించాలని, ఇంగ్లాండ్ తరపున ఆడాలని, ఒకరోజు జట్టుకు కెప్టెన్ గా ఉండాలని కలలు కన్నానని.. ఇప్పుడు ఆ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. అడుగడుగున తనకు మద్దతు ఇచ్చిన కుటుంబానికి, కోచ్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నాడు. వారు తనపై ఉంచిన నమ్మకం చాలా తేడాను తెచ్చిపెట్టిందన్నారు. వారు లేకుండా తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదన్నాడు. ఇంగ్లాండ్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి.. సిరీస్‌లు, ప్రపంచ కప్ లు , కీలక టోర్నమెంట్లు గెలుచుకునే దిశగా కృషి చేస్తానని అన్నాడు.

హ్యారీ బ్రూక్ అంతర్జాతీయ కెరీర్
26 ఏళ్ల హ్యారీ బ్రూక్ తన కెరీర్లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున 24 టెస్టులు, 26 వన్డేలు, 44 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టులలో బ్రూక్ 58.5 సగటుతో బ్యాటింగ్ చేస్తూ 2281 పరుగులు చేశాడు. అతను టెస్టుల్లో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో బ్రూక్ ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీల సాయంతో 816 పరుగులు చేశాడు. టీ20ల్లో హ్యారీ బ్రూక్ 798 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ నుంచి హ్యారీ బ్రూక్ నిషేధం
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల నిషేధం విధించింది. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ.. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన పేరును పోటీ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడిని వేలంలో కొనుగోలు చేసి ఆపై ఎటువంటి గాయం లేకుండా వైదొలగాలని నిర్ణయించుకుంటే అతనపై రెండేళ్ల నిషేధం విధించబడుతుంది.