
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళా వరల్డ్ టీ20 కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదివారం 'ఐసీసీ మహిళల ప్రపంచ టీ20 జట్టు'ను ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ఎంపికైంది. ప్రపంచ టీ20 టోర్నమెంట్లో భారత్ ఫైనల్ చేరలేకపోయినా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. గ్రూపు దశలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచి అగ్ర స్థానంలో నిలిచింది.
కానీ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమణకు గురైంది. హర్మన్ 183 పరుగులు, మంధాన 178 పరుగులతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అలీసా హేలీ (225) అగ్ర స్థానంలో ఉంది. అయితే హర్మన్ మెరుగైన స్ట్రైక్ రేట్ (160.52)తో పరుగులు రాబట్టింది.
పూనమ్ యాదవ్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో సగటున 6.30 పరుగులతో ఎనిమిది వికెట్లు తీసింది. ఐసీసీ జట్టులో భారత్, ఇంగ్లాండ్‌ల నుంచి అధికంగా ముగ్గురేసి ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
అలీసా హేలీ (అసీస్), స్మృతి మంధాన (ఇండియా), ఎమీ జోన్స్ (ఇంగ్లాండ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా), డీయాండ్ర డాటిన్ (విండీస్), జవేరియా ఖాన్ (పాక్), ఎలీస్ ఫెర్రీ (అసీస్), లీ కాస్పరెక్ (కివీస్), అన్యా శ్రబ్సోల్ (ఇంగ్లాండ్), కిర్ట్సీ గోర్డన్ (ఇంగ్లాండ్), పూనమ్ యాదవ్ (ఇండియా). 12వ ప్లేయర్‌గా జహనర ఆలమ్ (బంగ్లాదేశ్)