హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మరికొన్ని గంటల్లో ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ పైనల్ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో సెమీ ఫైనల్లో తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్ గాయపడింది.
శనివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె భుజానికి గాయమైంది. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రాక్టీస్‌కు దూరమైన ఆమె.. భుజానికి ఐస్ ప్యాక్ పెట్టుకొని ఉపశమనం పొందింది. దాంతో, ఆమె ఫైనల్లో బరిలోకి దిగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దీంతో భారత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది. హర్మన్ ప్రీత్ కౌర్ తుదిపోరుకు ఫిట్‌గా ఉంటుందని చెప్పింది. ముందు జాగ్రత్త కోసమే ఆమె ఐస్ ప్యాక్ పెట్టుకుందని మిథాలీ రాజ్ చెప్పింది. కాగా, ఇంగ్లాండ్, భారత్ జట్లు మధ్యాహ్నాం 2.30 గంటలకు లార్డ్స్ మైదానంలో తలపడనున్నాయి.
భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది. 2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది. 2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరింది.
అయితే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు, ఇప్పుడు మిథాలీనే టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్ గోస్వామి మాత్రమే సభ్యులు.