1983 కపిల్ దేవ్‌ని మరపించింది: ఎవరీ హర్మన్ ప్రీత్ కౌర్
హైదరాబాద్: 1983 వరల్డ్ కప్... సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఇక భారత్ ఇంటికే అనుకున్న సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో నాటౌట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
కట్ చేస్తే జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్ విజేతగా కూడా నిలిచిన సంగతి తెలిసిందే. సరిగ్గా 34 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ సెమీస్ జరిగింది. కాకాపోతే ఇది మహిళల సెమీస్ పైనల్. వేదిక కూడా ఇంగ్లాండే. ప్రత్యర్ధి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. పది సార్లు టోర్నీ జరిగితే ఆరుసార్లు ఆసీస్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఇంకేముంది అందరూ ఆస్ట్రేలియానే ఫేవరేట్ అనుకున్నారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి... ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మాచ్ స్వరూపాన్నే మార్చడమే కాదు కంగారులకు దిమ్మతిరిగేలా తన బ్యాట్‌తో సమాధానం చెప్పింది. ఆ అమ్మాయి ఎవరో కాదు 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్.

స్టేడియం నలువైపులా ఫోర్లు
క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచీ స్టేడియం నలువైపులా ఫోర్లు కొడుతూ సెంచరీతో కదం తొక్కింది. 115 బంతుల్లో 20 పోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. టీమిండియా పైనల్లోకి దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది. యావత్ ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది ఈ పంజాబీ అమ్మడు.

భారత్ స్కోరు 9.2 ఓవర్లకు 35/2
గురువారం డెర్బీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య ఉమెన్ వరల్డ్ కప్ సెమీ పైనల్ మ్యాచ్ జరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులోకి అడుగుపెట్టే సమయానికి భారత్ స్కోరు 9.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. అంతక ముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన కెప్టెన్ మిథాలీ రాజ్ ఒంటరి పోరాటం చేస్తోంది.

21వ ఓవర్ నుంచి ఆట ఏకపక్షంగా సాగిన మ్యాచ్
ఈ సమయంలో తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన కౌర్ ఆ తర్వాత తన బ్యాట్‌ని ఝళిపించింది. 21వ ఓవర్ నుంచి ఆట ఏకపక్షంగా సాగింది. తొలి 60 బంతుల్లో 41 పరుగులు చేసిన కౌర్ ఆ తర్వాతి 55 బంతుల్లో 130 పరుగులు సాధించింది. నాలుగో వికెట్‌కు దీప్తి శర్మతో కలిసి 137 పరుగులు జోడించగా, అయిదో వికెట్‌కు కృష్ణమూర్తితో కలిసి 43 పరుగులు జోడించింది.

281 పరుగుల్లో 171 పరుగులు కౌర్ చేసినవే
ఇలా టీమిండియా సాధించిన 281 పరుగుల్లో 171 పరుగులు కౌర్ చేసినవే కావడం విశేషం. 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన కౌర్ సెంచరీ చేరుకోడానికి పట్టిన బంతులు కేవలం 26 మాత్రమే. 100 నుంచి 150కి అవసరమైన బంతులు 17 మాత్రమే. దీనిని బట్టి చూస్తే కౌర్ సెంచరీ చేసిన తర్వాత చెలరేగి ఆడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్
ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడతారు. అలాంటి ఇన్నింగ్సే గురువారం ఆస్ట్రేలియాపై హర్మత్ ప్రీత్ కౌర్ అడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. హర్మన్ ప్రీత్ సెంచరీ చేసి తన బ్యాట్‌తో అభివాదం చేస్తున్న క్రమంలో మైదానంలో ఫీల్డర్లే ప్రేక్షకులయ్యారు.

మోకాలిపై కూర్చొని మిడ్‌వికెట్ మీదుగా సిక్స్
ఇక ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం హర్మన్ ప్రీత్ కౌర్ కళాత్మక డ్రైవ్‌లకు ముగ్ధులయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్‌స్టంప్ ఆవతల పడిన బంతుల్ని మోకాలిపై కూర్చొని మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచిన విధానం చూసి క్రికెట్ ప్రేక్షకులు సైతం ఆహో కౌర్ అని అంటున్నారు. హుక్, పుల్ మినహా ఈ మ్యాచ్‌లో కౌర్ అన్ని షాట్లు ఆడటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications