పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే అయిదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (137; 62 బంతుల్లో) మెరపు శతకం బాదాడు. కివీస్ తరపున టీ20ల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన న్యూజిలాండ్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఫిన్ అలెన్ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 224 పరుగులు చేసింది. జట్టులో రెండో అత్యధిక స్కోరు స్టీఫెర్ట్ (31; 23 బంతుల్లో). స్టీఫెర్ట్‌తో కలిసి రెండో వికెట్‌కు ఫిన్ అలెన్ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అనంతరం భారీ ఛేదనలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఓపెనర్ సయిమ్ అయుబ్ (10; 13 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ (24; 20 బంతుల్లో)తో కలిసి బాబర్ అజామ్ (58; 37 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ కివీస్ బౌలర్లు వికెట్లు సాధిస్తూ పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. టిమ్ సౌథి (2/29), శాంట్నర్ (1/26), ఫెర్గూసన్ (1/27) సత్తాచాటారు.
అయితే పాకిస్థాన్ ప్రధాన బౌలర్లు హరీస్ రవూఫ్, షాహిన్ అఫ్రిది దారుణంగా విఫలమయ్యారు. నాలుగు ఓవర్లలో హారిస్ 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా, షాహిన్ అఫ్రిది ఒక్క వికెట్ తీసి 43 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో హారిస్ రవూఫ్‌పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. తొలి 15 బంతుల్లో 50 పరుగులు సమర్పించుకున్నహారిష్‌కు అవార్డులు ఇవ్వాలని పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది వరల్డ్ రికార్డు అని, ఓ బౌలర్ సాధించిన వేగవంతమైన అర్ధశతకం అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు హారిస్ రవూఫ్‌కు పాకిస్థాన్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది అండగా నిలిచాడు. విజయం సాధించినప్పుడు హారిస్‌ను హీరోగా భావిస్తారని, కానీ ఓటమిపాలైనప్పుడే అతడే అసలు సమస్యగా వేలు చూపిస్తారని అఫ్రిది అన్నాడు. ''టీ20ల్లో హారిస్ రవూఫ్ మా అత్యుత్తమ బౌలర్. మేం విజయం సాధించినప్పుడు అతడు బెస్ట్‌గా అభివర్ణిస్తారు. కానీ ఓటమిపాలైనప్పుడు జట్టులో అసలు సమస్య అతడే అంటారు. న్యూజిలాండ్ జట్టులో మ్యాట్ హెన్రీ కూడా 50 పరుగులు సమర్పించుకున్నాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి'' అని షాహిన్ అఫ్రిది అన్నాడు.
న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 51 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా, టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు శ్రీలంక ప్లేయర్ రజిత పేరిట ఉంది. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు.