విండీస్ చేతిలో టీ20 సిరీస్ ఓడినప్పటి నుంచి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అనవసర ప్రయోగాలు చేసిన టీం మేనేజ్‌మెంట్‌తోపాటు టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాండ్యా చేసిన కొన్ని కామెంట్స్‌ను గుర్తు చేసి మరీ తిట్టిపోస్తున్నారు.
కొంతకాలం క్రితం 'భారత్‌లో చాలా ట్యాలెంట్ ఉంది. ఇప్పుడున్న టీం కాకుండా మరో రెండు టీమ్స్ తయారు చేసి, వాటితో కూడా ఎలాంటి టోర్నీ అయినా గెలిచే సత్తా భారత్‌కు ఉంది' అని పాండ్యా అన్నాడు. ఆ మాట అన్న తర్వాత భారత జట్టు ఓడిపోయినప్పుడల్లా ఫ్యాన్స్ దీన్ని ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా పాండ్యా కెప్టెన్సీలో టీ20 మ్యాచ్ ఓడితో మామూలుగా ట్రోల్ చేయడం లేదు.

ఇక తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో కూడా హార్దిక్ ఇలాగే నోరు జారాడు. నాలుగో టీ20లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. నికోలస్ పూరన్‌ను అడ్డుకోవడానికి పెద్దగా ప్లాన్స్ వేయలేదని చెప్పాడు. అతను తనను టార్గెట్ చేస్తే బాగుటుందని, అలాంటి పోటీ తనకు చాలా ఇష్టమని ఓవర్ కాన్పిడెంట్‌గా మాట్లాడాడు.
చివరి మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్‌లో పూరన్ చెలరేగాడు. వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన సత్తా నిరూపించుకున్నాడు. అదే మ్యాచ్‌లో అటు బంతితో, ఇటు బ్యాటుతో పాండ్యా తేలిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోసారి అతనిపై మండిపడ్డారు. పూరన్ టార్గెట్ చేస్తే ఇలాగే ఉంటుందంటూ ఎద్దేవా చేశారు.
అంతేకాదు, ఈ ఐదు టీ20ల సిరీసులో ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా పాండ్యా పెద్దగా రాణించింది లేదు. మూడో మ్యాచ్‌లో బంతితో ఫర్వాలేదనిపించాడు. ఇక నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. పాండ్యాకు మాటలెక్కువ, ఆట తక్కువ అంటూ ఎగతాళి చేస్తున్నారు.