టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియా మరో తొమ్మిది రోజుల్లో శ్రీలంకలో పర్యటించనుంది. లంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. భవిష్యత్ తారలను సిద్ధం చేయడానికి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రోడ్ మ్యాప్‌ను రెడీ చేయడానికి లంక సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత జట్టు యోచిస్తోంది.
అయితే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడని వార్తలు వస్తున్నాయి. కేవలం లంకతో సిరీస్ వరకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్ కెప్టెన్ సూర్యనే అని.. టీ20 వరల్డ్ కప్-2026 వరకు కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. సూర్య కెప్టెన్‌గా బాగుంటుందని రోహిత్ శర్మనే సిఫార్సు చేశాడని, దానికి నయా కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సెలక్షన్ కమిటీ సానుకూలంగానే స్పందించిందని సమాచారం.

అయితే హార్దిక్ పాండ్యను కాదని సూర్యను టీ20లకు కెప్టెన్‌గా నియమించడంపై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే రోహిత్ అనంతరం భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ అని భావిచారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరీలో జట్టు బాధ్యతలను స్టాండ్‌బై కెప్టెన్‌గా హార్దిక్‌యే చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్‌ను అధికారిక కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటిస్తుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సూర్య కెప్టెన్ అంటూ ప్రచారం సాగుతోంది.
దీంతో హార్దిక్ కెప్టెన్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. శ్రమ ఎప్పటికీ వృథా కాదంటూ పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ అనంతరం సర్జరీ చేయించుకున్నాడు. తిరిగి కోలుకుని టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగాడు. భారత్ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించాడు.
సర్జరీ తర్వాత, టీ20 వరల్డ్ కప్ సమయంలో తనని తాను పోల్చుకుంటూ పోస్ట్ చేశాడు. ''2023 వరల్డ్ కప్ తర్వాత ప్రయాణం కష్టతరంగా సాగింది. కానీ టీ20 వరల్డ్ కప్ విజయం కృషికి నిదర్శనంగా మిగిలింది. ప్రయత్నిస్తున్న కాలం ఫలితాలు వస్తూనే ఉంటాయి. శ్రమ ఎప్పటికీ వృథా కాదు, గుర్తిస్తారు. అందరం మన వంతు ప్రయత్నిద్దాం. ఫిట్‌నెస్‌పై పనిచేద్దాం'' అని హార్దిక్ పాండ్య రాసుకొచ్చాడు. అయితే సూర్య కెప్టెన్ అంటూ ప్రచారం సాగుతున్న సమయంలో హార్దిక్ ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు భావిస్తున్నారు.