
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో పాతికేళ్లుగా ఎదురుచూస్తోన్న సిరీస్ రానే వచ్చింది. అయితే ఈ సిరీస్‌కు తుది జట్టుగా ఎవర్ని తీసుకోవాలా అనే నిర్ణయంపై అధికారులు, కెప్టెన్ విరాట్ కోహ్లీలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంటున్నట్లుగా బీసీసీఐ నిర్ణయాన్ని ప్రకటించింది.
దీంతో యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చేరికతో భారత జట్టులో సమతూకం వచ్చిందట. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ చెప్పుకొచ్చాడు. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్ జట్టు తొలి టెస్టులో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టనుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్య కీలక ఆటగాడంటూ భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి తుది జట్టు ఎంపికలో బ్యాట్స్‌మెన్/ ఫాస్ట్ బౌలర్‌గా అతను అదనపు ఆప్షన్ అవుతాడని వివరించారు.
గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మెరుపు శతకం, అర్ధ శతకంతో హార్దిక్ రాణించిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య సమతూకం తెచ్చాడు. అతనిలో చాలా నైపుణ్యం ఉంది. మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో పరుగులూ రాబట్టగలడు.
తుది జట్టు ఎంపికలో హార్దిక్ పాండ్య ఒక పేసర్/బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ కోహ్లికి అదనంగా ఒకరిని జట్టులోకి ఎంచుకునే వెసులబాటు కల్పిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ హిట్టర్‌ని నిలువరించడానికి షార్ట్ పిచ్ బంతులు వేస్తారని నేను అనుకుంటున్నా. కానీ.. అప్పుడు హార్దిక్ కొంచెం సహనం పాటిస్తే.. సఫారీ బౌలర్లకి తర్వాత తిప్పలు తప్పవు' అని క్లూసెనర్ వివరించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.