
భారత జట్టులో మరో స్టార్ ఆటగాడు పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యాడు. అయితే అతనికి ఇంతకుముందే పెళ్లి అయిపోయింది. అతనెవరో కాదు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. కొంతకాలం పాటు మోడల్ నటాషాతో డేటింగ్ చేసిన పాండ్యా.. ఆ తర్వాత కొంతమంది సన్నిహితుల మధ్య ఆమెను 2020లో మే 31న పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ అదే ఏడాది జూలై నాటికి ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకు అగస్త్య అని పేరు పెట్టారు.
ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2020లో కేవలం సన్నిహితుల మధ్య వారి వివాహం జరిగింది. అప్పటి నుంచే మరోసారి భారీ స్థాయిలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట అనుకుంటోందట. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. ఇన్నాళ్లకు వీళ్లకు ఆ ముచ్చట కూడా తీరిపోనుంది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు మూడ్రోజుల పాటు వీరి వివాహ వేడుక జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ వేడుక చాలా ఘనంగా జరుగుతుందని సమాచారం. కాగా, కొన్ని రోజుల ముందే టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా సిరీస్ కోసం వెంటనే జట్టుతో చేరారు.
'వాళ్లిద్దరూ ఒక కోర్టులో వివాహం చేసుకున్నారు. అప్పుడు అన్నీ చాలా వేగంగా జరిగిపోయింది. అప్పటి నుంచే ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని వాళ్లు అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అవకాశం రావడంతో చాలా ఎగ్జయిట్ అవుతున్నారు' అని పాండ్యా దంపతులకు సన్నిహితులైన కొందరు చెప్తున్నారు. ఈ వివాహ వేడుకకు ముందు హల్దీ, మెహందీ, సంగీత్ తదితర కార్యక్రమాలన్నీ మంచి ఉత్సాహంగా జరిపించాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గతేడాది నవంబరు నుంచే మొదలు పెట్టినట్లు చెప్తున్నారు.