
హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన నిమిత్తం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్‌తో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడిస్తూ 'నా మొదటి లవ్ డీకేతోనే' అంటూ హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు.

అంతేకాదు హార్ట్ సింబల్‌ను సైతం ఈ ఫోటోకి జత చేశాడు. దీనిపై స్పందించిన దినేశ్ కార్తిక్ భార్య స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. 'సరే.. నా స్థానాన్ని చక్కగా భర్తీ చేశారు. చాలా థాంక్స్' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు సాహా గాయం కారణంగా దూరం కాగా, అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు.
ఇటీవల జరిగిన ఓ టీవీ ఇంటర్యూలో కూడా తాను ఎక్కువ సమయం హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌తోనే గడుపుతానని కార్తిక్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్ తొలిరోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఇంగ్లీషు గడ్డపై అశ్విన్ అద్భుత ప్రదర్శనకు తోడు పేసర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 285/9కే పరిమితమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ రూట్ (80; 156 బంతుల్లో 9 ఫోర్లు), బెయిర్ స్టో (70; 88 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 104 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జెన్నింగ్స్ (98 బంతుల్లో 4 ఫోర్లతో 42) ఫరవాలేదనిపించారు. స్పిన్నర్ అశ్విన్ (4/60), షమీ (2/64) సత్తాచాటగా ఉమేష్, ఇషాంత్ చెరో వికెట్ పడగొట్టారు.