

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టుకు తొలి సీజన్లోనే ట్రోఫీ అందించాడు. అతను బౌలింగ్లో మూడు కీలక వికెట్లు తీయడంతో రాజస్థాన్ 130/9 స్కోరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌లోనూ (34పరుగులు) విలువైన భాగస్వామ్యం అందించాడు. ఇక ఐపీఎల్ విజయానంతరం విలేకరుల సమావేశంలో హార్దిక్ మాట్లాడుతూ.. టీమిండియాకు ప్రపంచకప్ సాధించడమే తన ఏకైన లక్ష్యమని, అందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.
'ఏం జరిగినా సరే టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ గెలవాలి. నా సత్తా ఎంతుందో అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నేను ఎప్పుడూ జట్టు గెలవాలని తాపత్రాయపడే వ్యక్తిని. నా లక్ష్యం ఒకటే.. జట్టుకు నా ద్వారా ఇవ్వాల్సినదానికంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు టీమిండియా తరఫున ఆడాను. అయినప్పటికీ టీమిండియాకు ఆడడం ఎప్పటికీ నాకు ఓ డ్రీమ్‌లాగే ఉంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
ఇండియావ్యాప్తంగా అభిమానుల ప్రేమ, సపోర్టు నాకు అక్కడ లభిస్తుంది. టీ20 అయినా, వన్డే అయినా ఏ ఫార్మాటైనా సరే.. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలి.. అందులో నేను నా వంతు పాత్ర పోషించాలి అదే నా డ్రీమ్. ఏం జరిగినా సరే, నా డ్రీమ్ కోసం నేను ఎంతవరకైనా పోరాడుతా' అని విలేకరుల సమావేశంలో అన్నాడు.
హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఆద్యంతం రాణించాడు. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కెప్టెన్‌గానూ, ఆల్రౌండర్‌గానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో అతను 487పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధికంగా 15మ్యాచ్‌లలో 131.26 స్ట్రైక్ రేట్, 44కంటే ఎక్కువ సగటుతో ఈ పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. హార్దిక్ టోర్నీలో 10ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 8వికెట్లు తీశాడు.
ఇక ఫైనల్ విషయానికొస్తే.. ఫైనల్‌లో 3/17 అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయానికి హార్దిక్ బాటలు వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17పరుగులు మాత్రమే ఇచ్చి బట్లర్, శాంసన్, హెట్ మయర్ లాంటి విధ్వంస ప్లేయర్లను ఔట్ చేశాడు. అలాగే బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించాడు. శుభ్ మాన్ గిల్‌తో కలిసి 63పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుపొందాడు.