Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, తన కెరీర్‌ను మలుపు తిప్పిన క్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒత్తిడిని గుర్తు చేసుకుంటూ.. 2016 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ గురించి పాండ్యా ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులకే కట్టడి చేసి భారత్‌ను గెలిపించాడు. కేవలం ఒక్క శాతం అవకాశం అవకాశం ఉన్నా సరే.. చివరి బంతి వరకు పోరాడాలనే పాఠాన్ని ఆ మ్యాచ్ తనకు నేర్పిందని.. తన కెరీర్‌ను తీర్చిదిద్దిన కీలక క్షణాల్లో అది ఒకటని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
బ్యాటింగ్ సామర్థ్యంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ నైపుణ్యం గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను తన పూర్తి సామర్థ్యంలో కేవలం 40 శాతం మాత్రమే ఉపయోగించుకున్నానని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌పై నమ్మకం ఉన్నప్పటికీ.. తనకు బ్యాటింగ్ అంటేనే ఎంతో ఇష్టమని తెలిపాడు. గత ఐపీఎల్ తర్వాత తనలోని పూర్తి బ్యాటింగ్ ప్రతిభను బయటకు తీయాలని నిర్ణయించుకున్నానని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నానని హార్దిక్ పాండ్యా వివరించాడు. తన అసలైన ఆట ఇంకా ముందుందని అభిమానులకు హింట్ ఇచ్చాడు ఈ డైనమిక్ ఆల్‌రౌండర్.

మహీక రాకతో మారిన ఆలోచనా దృక్పథం
తన వ్యక్తిగత జీవితం , వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత గురించి పాండ్యా వివరిస్తూ 'మహీక' గురించి హార్దిక్ ప్రస్తావించాడు. మహీక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే క్రికెట్‌పై తనకున్న ఉత్సాహాన్ని తిరిగి కనుగొన్నానని హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఆమె ప్రోత్సాహంతోనే తాను ఆటపై మరింత ఏకాగ్రత పెంచగలిగానని, తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో గ్రహించానని పాండ్యా పేర్కొన్నాడు.
కఠినమైన ప్రాక్టీస్ సెషన్లు
తిరిగి ఫామ్‌లోకి రావడానికి తాను ఎంతలా కష్టపడ్డాడో హార్దిక్ వివరించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 12:30 గంటల వరకు వరుసగా ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పాడు. మైదానంలో లైట్లు ఆపివేసే వరకు అక్కడే ఉండి, అందరి కంటే చివరగా బయటకు వచ్చే వ్యక్తిని నేనేనని తన కఠోర శ్రమను పాండ్యా గుర్తు చేసుకున్నాడు. ఈ శ్రమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని హార్దిక్ పాండ్యా గర్వంగా చెప్పాడం గమనార్హం.