
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి మంగళవారం 31వ పుట్టినరోజుని జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలను రాంచీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్నేహితులు హాజరయ్యారు.
సాక్షి ధోని బర్త్‌డే వేడుకల్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు రాబిన్ ఊతప్ప భార్య శీతల్ గౌతమ్‌లు సందడి చేశారు. సాక్షి ధోనికి శీతల్ గౌతమ్ మంచి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. భర్త ధోని, కుమార్తె జీవాతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోలను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా సాక్షి ధోనికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సాక్షి ధోని యాక్టివ్‌గా ఉంటుంది. గతంలో ధోనీని, జీవాను తెగ మిస్ అవుతున్నట్లు హార్దిక్ పాండ్యా ట్వీట్ చేయగా.... దీనికి సమాధానంగా "హార్దిక్ నీకు తెలుసా? రాంచీలో నీకు ఇల్లు ఉంది" అంటూ రీట్వీట్ చేసింది.
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.
వెస్టిండిస్‌తో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి జార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండిస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోని వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.