హైదరాబాద్: ఆటగాళ్ల ఫామ్ కంటే వారి హెయిర్ స్టైల్ బాగుంటేనే భారత జట్టులో చోటు దక్కుతుందంటూ ఇటీవల మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తనదైన శైలిలో స్పందించాడు. జాతీయ ఛానల్ హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా పదునైన విమర్శలే చేశాడు.
'నా హెయిర్ స్టైల్.. నా ఇష్టం. నేను ఎవరి కోసమో హెయిర్ స్టైల్ ఇలా చేయించుకోలేదు. నాది నా వ్యక్తిత్వానికి సంబంధించినది. ఇలా చేయించుకుంటే భవిష్యత్తు క్రికెట్ పై భరోసా ఉంటుందనే విషయం నాకైతే తెలీదు. నేను బ్రతికే విధానాన్ని వేరే వారి కోసం మార్చుకోను. నా కోసమే ఏదైనా చేస్తా. నీకు నచ్చినా, నచ్చకపోయినా నాకు అనవసరం. నాకు నచ్చితే చాలు' అని పాండ్యా అన్నాడు.

మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండాలని, ఒకరి కోసం.. మన ఇష్టాల్ని వదులుకోవాల్సి అవసరం లేదని పాండ్యా పేర్కొన్నాడు. ఒకవేళ తాను ఏ తప్పు చేసినా వచ్చి ఎదురుగా చెబితేనే బాగుంటుదని, అంతేకానీ పక్కన మాట్లాడే వారి కోసం తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పాండ్యా తెలిపాడు.
తాను కొన్ని విషయాల్లో చాలా ఓపెన్‌గా ఉంటాననే విషయాన్ని కొందరు గ్రహిస్తే బాగుంటుందని గవాస్కర్‌ని ఉద్దేశించి పాండ్యా వ్యాఖ్యానించాడు. తాను క్రికెట్ ఫీల్డ్‌లో దిగానంటే క్రూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. జట్టుకు గెలుపు అందించడం కోసం తన సర్వశక్తులు ఒడ్డుతానని, ఆ క్రమంలోనే అవతలి జట్టుపై పైచేయి సాధించడానికి ఎలాంటి కనికరం చూపించనని పాండ్యా అన్నాడు.
ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో భాగంగా ఐదు వన్డేల సిరిస్‌లో ప్రయోగాల సమయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. పలువురు కీలక ఆటగాళ్లను పక్కకు పెట్టడంపై గవాస్కర్ తనదైన శైలిలో స్పందించాడు.
'శ్రీలంక పర్యటనలో పలువురు ప్రధాన ఆటగాళ్లను పరీక్షించాల్సి ఉన్నా వారిని పట్టించుకోలేదు. ఇక్కడ వారి ఫామ్ కంటే కూడా హెయిర్ నచ్చాలేమో. ఎవరైతే వైవిధ్యమైన హెయిర్ స్టైల్ తో ఉంటారో వారినే జట్టులో ఎంపిక చేస్తారేమో' అని సన్నీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.