పొట్టి ఫార్మాట్‌లో టిక్ కొట్టేశాం. అదిరే రీతిలో టీ20 వరల్డ్ కప్ గెలిచేశాం. ఇక వన్డే, టెస్టు ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలవడమే బాకీ ఉంది. 2025లో ఈ కలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ రెండింట్లో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మరో కొన్ని ఐసీసీ టైటిళ్లు చేరుతాయి.
అయితే భారత్ గత రెండు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరింది. కానీ టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది. తొలి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఇక గత ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ రెండూ ఫైనల్స్ ఇంగ్లండ్ వేదికగానే జరిగాయి. అయితే ఈ సారి మాత్రం భారత్ టెస్టు ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలుస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కానీ అలా జరగాలంటే భారత టెస్టు జట్టులో హార్దిక్ పాండ్య ఉండాలని గవాస్కర్ పేర్కొన్నాడు. హార్దిక్ వస్తే జట్టు బలోపేతంగా, సమతూకంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ రోజుకు కనీసం పది ఓవర్లు బౌలింగ్ చేసి, బ్యాటింగ్ చేసినా భారత జట్టును పటిష్టంగా ఉంటుందని, ఎవరూ ఓడించలేరని చెప్పాడు.
''కచ్చితంగా భారత్ ఈసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలుస్తుంది. అయితే వచ్చే రెండు నెలల్లో హార్దిక్ పాండ్యను టెస్టు క్రికెట్ ఆడేలా ఒప్పించాలి. అతను రోజుకు పది ఓవర్లు పాటు బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసినా చాలు, భారత జట్టు అజేయంగా మారతుంది. కచ్చితంగా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడిస్తుంది. అలాగే టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతగా నిలుస్తుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
వరుసగా గాయాలవుతూ జట్టుకు తరుచూ దూరమవుతున్న హార్దిక్ పాండ్య ప్రస్తుతం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నవిషయం తెలిసిందే. 2018లో చివరిసారి హార్దిక్ టెస్టు ఆడాడు. కాగా, ఈ నెలాఖరులో ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటన ముగిసిన అనంతరం భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో తలపడనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆస్ట్రేలియాతో టీమిండియా అయిదు టెస్టులు ఆడనుంది.