గెలిచింది రాజస్థాన్.. మనసు గెలిచింది హార్దిక్! (వీడియో)
క్రీడల్లో గెలుపోటములు సహజం.. కానీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించినప్పుడే ఆటగాళ్లు నిజమైన విజేతలుగా నిలుస్తారు. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో ఇదే దృశ్యం కనిపించింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై పరాజయం పాలైనప్పటికీ.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శించిన అసాధారణ బ్యాటింగ్‌కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిదా అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించిన హార్దిక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుమ్రాకే షాకిచ్చిన బుడ్డోడు..
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. అదే ఓవర్లో మరో సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు చేసి రాజస్థాన్ స్కోరును పరుగులు పెట్టించాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ (77 నాటౌట్)తో కలిసి వైభవ్ అందించిన మెరుపు ఆరంభంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది.

హార్దిక్ ప్రశంసల జల్లు
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్‌ను ఆకాశానికెత్తాడు. "15 ఏళ్ల కుర్రాడు ఇంత నిర్భయంగా ఆడటం చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నప్పుడే వైభవ్ గురించి మా జట్టులో చాలా చర్చ జరిగింది. వైభవ్ ఆడే షాట్లు, అతనిలోని ఆత్మవిశ్వాసం అద్భుతం. వైభవ్ భవిష్యత్తు మరిన్ని విజయాలతో నిండాలని కోరుకుంటున్నాను" అని హార్దిక్ పాండ్యా తన మనసులోని మాటను పంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ.. ఓ యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్దిక్ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పట్టు కోల్పోయిన ముంబై ఇండియన్స్
రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే తడబడింది. రోహిత్ శర్మ(5), సూర్యకుమార్ యాదవ్(6) వంటి స్టార్ ప్లేయర్లు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ముంబై కష్టాల్లో పడింది. తిలక్ వర్మ(14), హార్దిక్ పాండ్యా(9) ప్రయత్నించినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై 123 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చివరగా ఈ మ్యాచ్ ఫలితం కంటే బుమ్రాను ఎదిరించిన వైభవ్ సూర్యవంశీ ధైర్యం, ఆ కుర్రాడిని అభినందించిన హార్దిక్ సంస్కారం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications