హైదరాబాద్: 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ తర్వాత అంతటి ఆటగాడు భారత జట్టుకు దొరికాడని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సెంచరీ చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు.
కపిల్ దేవ్ రిటైర్మెంట్ తర్వాత పాండ్యా రూపంలో భారత్‌కు ఇన్నాళ్లకు మరో ఆల్ రౌండర్ దొరికాడని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. 'ఆల్ రౌండర్ కోసం మా నిరీక్షణ పాండ్యా రూపంలో ఫలించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు బాగా నిలదొక్కుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో కూడా నిలదొక్కుకోవడానికి ఈ సిరిస్ అతడికి మంచి వేదికలా నిలిచింది' అని అన్నాడు.

అతడికి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే భవిష్యత్తులో అతడిని క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌తో పోలుస్తారు. పాండ్యా... కపిల్ అంత ఎత్తుకు ఎదుగుతాడు' అని ఎమ్మెస్కే ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల ఆధిక్యం సాధించడంలో పాండ్యా కీలకపాత్ర పోషించాడు.
రెండో రోజు పాండ్యా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 329/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ సాహా(16) వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా కుల్దీప్‌తో ఎనిమిదో వికెట్‌కు పాండ్య 62 పరుగులు జోడించాడు.
ఇన్నింగ్స్ 110వ ఓవర్లో జట్టు స్కోరును 400 దాటించాడు. శ్రీలంక గడ్డపై వరుసగా మూడు టెస్టుల్లో 400పై స్కోర్లు సాధించిన తొలి జట్టుగా భారత్ ఘనత సాధించింది. ఆ తర్వాత కుల్దీప్ అవుటైనా... పాండ్యా జోరు తన జోరుని కొనసాగించాడు. బౌలర్ మహమ్మద్ షమితో కలిసి 20 పరుగులు జోడించాడు.
షమి నిష్క్రమణ తర్వాత ఉమేశ్ యాదవ్ (3 నాటౌట్)తో కలిసి పాండ్యా కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని టెస్టు క్రికెట్లో చేసిన ఐదో భారత ఆటగాడిగా పాండ్యా అరుదైన ఘనత సాధించాడు.
అంతకుముందు పాండ్యా అత్యధికి స్కోరు 90గా ఉంది. సెంచరీ కోసం పాండ్యా ఆడిన బంతులు 86. విదేశీ గడ్డపై ఓ భారత బ్యాట్స్‌మన్‌కు ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 78 బంతుల్లో వెస్టిండిస్‌పై సెహ్వాగ్ సెంచరీ చేశాడు. పాండ్యా తన ఇన్నింగ్స్‌లో వరుసగా మూడు సిక్సులు బాదాడు. దీంతో కపిల్‌దేవ్, ధోని తర్వాత టెస్టుల్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్ నిలిచాడు.