హైదరాబాద్: చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో పాండ్యా 66 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ట్విటర్ వేదికగా పాండ్యా, ధోనిలను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు. 'అద్భుతంగా పుంజుకుని భారత్ గొప్ప విజయాన్ని సాధించింది. పాండ్యా, ధోని మీరు నిజమైన ఛాంపియన్‌లు. వాట్ ఏ గ్రేట్ గేమ్' అని ట్విట్టర్‌లో కొనియాడాడు.
దీనికి వెంటనే స్పందించిన పాండ్యా 'ధన్యవాదాలు సార్. నేను మీకు వీరాభిమానిని' అంటూ బదులిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి అనిల్ కపూర్ 'చెన్నైలో నీ ఇన్నింగ్స్ చూసి దేశమంతా నీ అభిమానులుగా మారిపోయారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది' అని మరోసారి సమాధానమిచ్చాడు.
చెన్నైలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.