Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరడం లేదు. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై జట్టు.. తాజాగా అహ్మదాబాద్ లో శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటివరకు రెండింట్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది. వరుస ఓటముల్లో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల జరిమానానా విధించింది. ప్రస్తుత సీజన్ లో ఇలాంటి జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్ గా హార్ధికా పాండ్యా నిలిచాడు. ఇదిలా ఉండగా.. గత సీజన్ ఆఖరి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగలేదు. ఇప్పుడు గుజరాత్ మ్యాచ్ లోనూ హార్దిక్ పాండ్యాపై జరిమానా పడింది.
ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. స్లో ఓవర్ రేట్ కు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్ పై వేటు పడదు. అతడికి జరిమానా విధించడంతో పాటు డీమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు.

ఐపీఎల్ 2024లో..
గత సీజన్ చివరి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 తొలి సీజన్ లో లక్నోతో ముంబై చివరి మ్యాచ్ ఆడింది. అప్పటికే రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా జరిమానాను ఎదుర్కొన్నాడు. అంతకుముందు పంజాబ్, లక్నోతో ఆడినప్పుడు పాండ్యాకు రూ.12 లక్షలు, రూ.24 లక్షల చొప్పున జరిమానా పడింది. ఇక లక్నోతో రెండో మ్యాచ్ అనంతరం మళ్లీ పాండ్యాకు జరిమానా పడడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ఆ సీజన్ లో అన్ని మ్యాచ్ లు ముగియడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్ లో నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సీజన్ ఆరంభంలోనే స్లో ఓవర్ రేట్ చేశాడంటే మిగతా మ్యాచ్ లలో ఎలా మెయింటైన్ చేస్తాడో చూడాల్సిందే.