హైదరాబాద్: టెస్టు క్రికెట్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఓ క్రికెటర్ అసలుసిసలు సత్తా తెలిసేది కూడా టెస్టు క్రికెట్‌లోనే. వన్డేలు, టీ20ల్లో రికార్డులు సృష్టించినా, బద్దలు కొట్టినప్పటికీ... టెస్టు క్రికెట్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది.

శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. జులై 26 (బుధవారం) నుంచి గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో కోహ్లీసేన తొలి టెస్టు ఆడనుంది. దీంతో లంకతో తొలి టెస్టు మ్యాచ్ మొదలవడానికి ఒకరోజు ముందే టెస్టు డ్రెస్ వేసుకొని పాండ్యా మురిసిపోయాడు.
తన సెల్ఫీ తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పాండ్యా అభిమానులతో తన ఆనంద క్షణాలను పంచుకున్నాడు. 'టెస్టు క్రికెట్‌లో ఇండియన్ టీమ్‌కు ఆడాలన్నది తన చిన్ననాటి కల అని, అది ఇప్పుడు నెరవేరుతుంటే ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది' అని పాండ్యా అన్నాడు.