
హైదరాబాద్: నిషేధం అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆ ఫోటోపై పాండ్యాను ట్రోల్ చేశారు.
ధోని, కేదార్ జాదవ్, కృనాల్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌తో కలిసి తీసుకున్న ఫోటోని పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దానికి 'కొంత ఆహారం.. కొన్ని నవ్వులు' అని కామెంట్ పెట్టాడు. అతడిని అభిమానించే వారు బాగుందని చెప్పగా కొందరేమో 'కొంత.. కాఫీ' అంటూ ట్రోల్ చేశారు.
ఈ మధ్యే కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్య మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతడి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. దానిని దృష్టిలో పెట్టుకొనే కొందరు 'కాఫీ' అంటూ పాండ్యాను ట్రోల్ చేశారు.
నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొట్టాడు. మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 6 వికెట్లు తీసి, 65 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది.