తమ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ ప్రకటించినప్పటి నుంచి పెద్దఎత్తున చర్చలు సాగుతున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడానికి కారణమేంటి? సారథి బాధ్యతలను ఇస్తారనే హార్దిక్ తిరిగి ముంబయి గూటికి చేరాడా? రోహిత్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనా? టీమిండియా కెప్టెన్సీ నుంచి కూడా రోహిత్ దూరమవుతాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే ముంబయికి భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్‌ను ముందే అందరూ ఊహించుకున్నారు. కానీ 2024 సీజన్ నుంచి అది జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.మరోవైపు ముంబయి నిర్ణయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు హార్దిక్‌కు వెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. గత కొంత కాలం నుంచి పనిఒత్తిడి కారణంతో పొట్టి క్రికెట్‌లో టీమిండియాకు హార్దిక్‌యే కెప్టెన్‌గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి నిర్ణయం రోహిత్ కెప్టెన్సీపై ప్రభావం చూపనుందని అభిప్రాయపడుతున్నారు.

కానీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాని నడిపించే బాధ్యత రోహిత్ శర్మకే అప్పగించడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉందని సమాచారం. హార్దిక్ సారథ్యంలో ముంబయి తరపున రోహిత్ కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగినా టీమిండియా కెప్టెన్సీ మాత్రం హిట్‌మ్యాన్‌కే ఇవ్వాలని బీసీసీఐ చూస్తోందంట. బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ ఎప్పటికీ రోహిత్‌యే అని బీసీసీఐ వర్గాలు తేల్చిచెప్పాయి.
మరోవైపు రోహిత్ శర్మ తన పనిభారాన్ని తగ్గించుకోవడం కోసమే ఐపీఎల్‌లో ముంబయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ గొప్ప సారథి అని, తన బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ చూపించడానికి ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చని చెప్పాడు. 2013లో ముంబయి సారథి బాధ్యతలు అందుకున్న రోహిత్ అయిదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు.
కాగా, వరల్డ్ కప్ అనంతరం టీమిండియాకు దూరమైన రోహిత్ శర్మ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టెస్టు సిరీస్ కోసం తిరిగి జట్టుతో చేరనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.