
హైదరాబాద్: టీమిండియాకు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ల నేపథ్యంలో మొదలుపెట్టిన విదేశీ పర్యటనకు శుభారంభమే దక్కింది. టీమిండియా ఓపెనర్లిద్దరూ 15 ఓవర్ వరకూ ఆడి స్కోరును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించుకున్న స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను ముగించారు. కాగా, స్టార్ బ్యాట్స్‌మెన్‌లతో పోరాడిన కోహ్లీసేన అనుకున్నంత రాణించలేకపోయిందంటూ విమర్శలనూ ఎదుర్కొంటున్నారు.
ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ హెలికాప్టర్ సిక్సర్లు బాదలేకపోయాడు. కానీ.. ఆ కొరతని హిట్టర్ హార్దిక్ పాండ్య ఆఖరి బంతిని హెలికాప్టర్ షాట్‌తో సిక్సర్‌గా బాది తీర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ 61 బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సుల సహాయంతో (97), శిఖర్ ధావన్ 45 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సులు బాది (74) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని 5 బంతుల్లో ఒక ఫోర్, సిక్సు (11)దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (0) కూడా ఔటయ్యారు. దీంతో సెంచరీకి మూడు పరుగుల దూరంలోనే హిట్ మ్యాన్ కూడా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (6 నాటౌట్)కి ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
ఐర్లాండ్ బౌలర్ ఆఫ్ స్టంప్‌కి సమీపంలో బంతిని విసరగా.. మహేంద్రసింగ్ ధోనీని తలపిస్తూ హెలికాప్టర్ షాట్ బాదిన హార్దిక్ పాండ్య బంతిని బౌలర్ తలమీదుగా సిక్స్‌గా తరలించాడు. అనంతరం ఛేదనకు దిగిన ఐర్లాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుని 132/9కే పరిమితమైంది. దీంతో.. భారత్ 76 పరుగుల తేడాతో గెలుపొందగా.. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి జరగనుంది.