టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన సతీమణి నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబయి నుంచి విడిచిన కొన్ని గంట్లోనే హార్దిక్ ఈ విషయాన్ని తెలిపాడు.
''నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా,నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే''

''ఆగస్త్య మా ఇద్దరితోనూ ఉంటాడు. అతని సంతోషం కోసం సహ తల్లిదండ్రులా మేం అండగా ఉంటాం. ఈ కష్టమైన సమయంలో మా గోప్యతకు సహకరించాలని, మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం'' అని హార్దిక్/నటాషా ట్యాగ్ లైన్‌తో హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాదాపు ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో హార్దిక్-నటాషాకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో హార్దిక్ పాండ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వేడుక తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఓ ఏడాది తర్వాత హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో నటాషా పేర్కొంది. హార్దిక్‌కు కొనియాడుతూ పోస్ట్‌లు పెట్టింది. 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు.
సముద్ర జలాల మధ్య నటాషాను ప్రపోజ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్-నటాషా డేటింగ్‌లో ఉన్నారు. ఆ ఏడాది లాక్‌డౌన్‌లో తాము తల్లిదండ్రులు అయ్యామని తెలిపారు. 2020 జులైలో ఆగస్త్యకు జన్మనిచ్చారు. అయితే వారిద్దరు వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 13న పెళ్లిచేసుకున్నారు.