భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాయ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ మురళీ కార్తీక్ మధ్య ఏదో విషయంలో వాడివేడి చర్చ జరిగినట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ కిట్ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకుని వార్మప్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలో కామెంటరీ విధుల్లో ఉన్న మురళీ కార్తీక్ అక్కడికి రావడంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మాటలు సాధారణంగా సాగలేదని.. ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో మురళీ కార్తీక్ ఏదో వివరిస్తూ హార్దిక్ పాండ్యాను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన కొంత సీరియస్‌గా ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను ప్రేక్షకులు స్టాండ్స్ నుంచి రికార్డ్ చేయడంతో అందులో మాటలు ఏవీ వినిపించడం లేదు. కేవలం మైదానంలోని సందడి మాత్రమే వినిపిస్తోంది. కాబట్టి వారి మధ్య నిజంగానే గొడవ జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ విధ్వంసం సృష్టించడంతో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే బౌలింగ్‌లో మాత్రం ఆయన ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన హార్దిక్, కేవలం 25 పరుగులు ఇచ్చి కీలకమైన మార్క్ చాప్‌మన్ వికెట్‌ను పడగొట్టాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ కివీస్ పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ (82*), ఇషాన్ కిషన్ (76) మెరుపు దాడితో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా (28 బంతులు మిగిలి ఉండగానే) ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది.