ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లకపోవడమే మంచిదని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. పాకిస్థాన్‌కు టీమిండియా రాదని బీసీసీఐ తేల్చిచెప్పడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ఓ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్ సిద్ధం చేసింది. అయితే పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరిస్తుంది. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని, దుబాయ్ లేదా శ్రీలంక వేదికగా జరపాలని ఐసీసీని డిమాండ్ చేస్తుంది.

ఆసియా కప్- 2023ను కూడా పాక్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరిగింది. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్‌లను ఆడింది. హైబ్రిడ్ పద్దతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని పీసీబీ భావిస్తుంది. ఈ మేరకు భారత్ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనీ గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తామని, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని, టీమిండియాను తమ దేశానికి వచ్చేలా చూడమని ఐసీసీని పాకిస్థాన్ అభ్యర్థిస్తోంది. కానీ బీసీసీఐ దానికి అంగీకరించట్లేదు.
దీని గురించి హర్భజన్ సింగ్ స్పందించాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అన్నాడు. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమని తెలిపాడు.''భారత జట్టు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లాలి? ఆ దేశంలో భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. ప్రతిరోజూ అక్కడ ఏదో ఒక హింసాత్మక ఘటన జరుగుతుంటుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆటగాళ్ల భద్రతకంటే ఏదీ ముఖ్యం కాదు' అని భజ్జీ పేర్కొన్నాడు.
అయితే దీనిపై అంతిమ నిర్ణయం ఐసీసీనే తీసుకుంటుంది. అయితే బీసీసీఐని కాదని, భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే సాహసం బీసీసీఐ చేయదు. కానీ పాకిస్థాన్‌ను బుజ్జగించడానికి టోర్నీ నిర్వహణ నిధులను ఎక్కువ మొత్తంలో మంజూరు చేసే అవకాశం ఉంది. శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా భారత్ తమ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.