ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్నట్లు కథనాలు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన వెల్లడించలేదు. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు షరతులు విధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
హైబ్రిడ్ మోడల్ కారణంగా తమ ఆదాయానికి గండి పడుతుందని, కాబట్టి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూను అధిక మొత్తంలో పెంచాలని షరతు పెట్టింది. అంతేగాక 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌ను కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని, తమ జట్టును ఇండియాకు పంపించమని మరో షరతు తెలిపింది. ఈ రెండు షరతులతో పాటు మరో మూడేళ్ల పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు దుబాయ్ వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

చివరి డిమాండ్‌తో భారత్‌కు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. భారత్‌లో వచ్చే ఏడాది ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్ జరగనుంది. అంతేగాక 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఒప్పందంతో భారత్‌కు కలిసొచ్చేదేమి లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరిపై టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భద్రతా సమస్యల దృష్ట్యా పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లడానికి సాహిసించట్లేదని హర్భజన్ సింగ్ అన్నాడు. 2022 నుంచి ఈ విషయాన్ని తాను వివరిస్తున్నాని తెలిపాడు. ఇగోని పక్కనపెట్టి హైబ్రిడ్ మోడల్‌ను పాక్ బోర్డు అంగీకరించాలని భజ్జీ చెప్పాడు. పాక్ బోర్డు తమ ప్లేయర్లను ఒకసారి అడగాలని... వాళ్లంతా అబుదాబి లేదా దుబాయ్ వేదికగా ఆడటానికి అంగీకరిస్తారని పేర్కొన్నాడు.
కాగా, 2008 ముంబయి దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించని విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.