హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ పెళ్లిలో డాన్స్‌తో అదరగొడతానని అందుకు ఉదాహరణగా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు స్పిన్నర్ హార్భజన్ సింగ్. వివరాల్లోకి వెళితే యువరాజ్ సింగ్... బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ను డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హార్భజన్ సింగ్ స్పందించాడు. యువరాజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నందుకు హర్భజన్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. యువీ పెళ్లిలో డాన్స్‌తో అదరగొడతానని చెప్పాడు. ఎలా డాన్స్ చేయాలని భావిస్తున్నాడో చెబుతూ తన ఫేస్‌బుక్‌లో భజ్జీ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలు మాస్ స్టెప్పులకు డ్యాన్స్ చేస్తుండగా కుర్చీల్లో కూర్చుని కొంత మంది చూస్తున్నారు. కాగా, యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్ ఇద్దరూ మంచి స్నేహితులు. రంజీ క్రికెట్‌లో వీరిద్దరూ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు టీమిండియా సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో వీరిద్దరి భాగస్వామ్యం కూడా ఉంది.
గతేడాది హార్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా బస్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో పంజాబ్ తరఫున యువీ రంజీ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, మ్యాచ్‌కి రాకుండా భజ్జీ విహహ రిసెప్షన్‌కు యువరాజ్ సింగ్ హాజరై యువీ డ్యాన్స్ చేశాడు. తన పెళ్లికి వచ్చి డ్యాన్స్ చేసినందుకు గాను... భజ్జీ కూడా ఇప్పుడు యువీ పెళ్లిలో హంగామా చేయబోతున్నాడు.