
ముంబై: ప్రస్తుతం ప్రపంచంలో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్వినే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అని భారత వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. మరిన్ని ఎక్కువ వికెట్లు తీసుకునేందుకు ఫిట్నెస్ను కాపాడుకోవాలని అశ్విన్‌కు సూచించాడు. గత దశాబ్దం తొలి ఐదేళ్లు టీమిండియాలో చోటు కోసం పోటీ పడ్డ ఇద్దరు స్పిన్నర్లు హర్భజన్, అశ్విన్ సోమవారం సాయంత్రం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో సరదాగా మాట్లాడుకున్నారు.
'మన ఇద్దరి మధ్య చాలా ఈర్ష్య ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే అలాంటివి ఏం లేవని నేను అందరికీ చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో ప్రస్తుతం ఆశ్వినే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ కూడా మంచి స్పిన్నర్. స్పిన్‌కు సహకరించని ఆస్ట్రేలియా పిచ్‌లపై లియాన్ బాగా రాణిస్తున్నాడు. అయితే అశ్విన్ దిగ్గజంలా మారతాడు. మున్ముందు మరిన్ని వికెట్లు తీసుకునేందుకు ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాసే సత్తా అశ్విన్‌లో ఉంది' అని హర్భజన్ పేర్కొన్నాడు.

'నేను చెపాక్ టెస్టును ఎప్పుడూ మిస్ కాలేదు. జట్టులో సభ్యుడుగా ఉండేవాడిని లేదా స్టేడియంలో ప్రేక్షకుడిగా ఉండేవాడిని. ఆ టెస్ట్ సమయంలో నేను స్టేడియంలో ఉన్నాను. హేడెన్ క్యాచును మీరు వదిలినందుకు బహుతులే వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పడం నేను చూశాను. ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఉండే గేమ్ స్పిరిట్ గురించి మా నాన్న ఎప్పుడూ చెపుతుండేవాడు. ఆ సమయంలో అది నాకు గుర్తుకు వచ్చింది. అది నాపై తీవ్ర ప్రభావం చూపింది' అని రవిచంద్రన్ అశ్విన్ గుర్తుచేసుకున్నాడు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 'టీ20 గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఎంఎస్ ధోనీ కూడా ఒకడు. ఆ ఫార్మాట్‌లో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో ధోనీని నిలువరించడం అసాధ్యం. ఇక ధోనీ గురించి అంటారా..? భారత్ ఇప్పటి వరకూ చూడని గొప్ప కెప్టెన్ మహీ. అలానే ఐపీఎల్‌లోనూ అదే స్థాయిని అతను అందుకున్నాడు' అని అశ్విన్ వెల్లడించాడు.