
అదే ధోనీ లాస్ట్ మ్యాచ్:
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో గురువారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న హర్భజన్ సింగ్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైవ్ సందర్భంగా ధోనీ తిరిగి ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు భజ్జీ సమాధానం ఇచ్చాడు. 'ధోనీ ఐపీఎల్‌లో ఆడాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కానీ.. ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే భారత్ జట్టుకి మళ్లీ ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడా? లేదా?. నా అంచనా ప్రకారం టీమిండియాకి ఆడాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతం అతనికి లేదు. మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని అతనికి లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడేశానని అతను భావిస్తున్నాడు' అని హర్భజన్ తెలిపాడు.

ధోనీనే అడగండి:
లైవ్ సందర్భంగా ఎంఎస్ ధోనీ తిరిగి ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ... 'ఈ ప్రశ్న మీరు ధోనీనే అడిగితే సరైన సమాధానం లభిస్తుంది' అని అన్నాడు. 'ధోనీ క్రికెట్ ఆడటం ఆపేస్తే ఎవరికీ దొరకడు. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. ధోనీ రాంచీలో ఉంటాడని అందరికీ తెలుసు. అతను మళ్లీ ఆడతాడా లేదా అనే డౌట్ ఉన్నవాళ్లందరూ అక్కడికి వెళ్లి నేరుగా అతన్నే అడగండి. కానీ లాక్‌డౌన్ ముగిశాకే వెళ్లండి. ప్రపంచకప్ నుంచి ఇప్పటిదాకా ధోనీ భవితవ్యంపై ఎలాంటి సమాచారం లేదు' అని రోహిత్ చెప్పాడు.

ప్రశ్నార్థకంలో ధోనీ అంతర్జాతీయ కెరీర్:
2019 వన్డే ప్రపంచకప్‌లో చివరగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత 9 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని యోచించాడు. కానీ.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడటంతో ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడిపోయింది.

రేసులో రాహుల్:
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ రాహుల్‌కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
