ఛాపెల్ ఏ ఉద్దేశంతో కోచ్‌గా వచ్చాడో ఎవరికీ తెలియదు.. ఆ దేవుడికే తెలుసు: భజ్జీ

ముంబై: టీమిండియా కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఏ ఉద్దేశంతో వచ్చాడో ఎవరికీ తెలియదని, ఆ దేవుడికే విషయం తెలుసు అని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఛాపెల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలమైన జట్టును అధ్వానంగా మార్చాడన్నాడు. విభజించు-పాలించు సూత్రంతో ఆటగాళ్ల మధ్య గందరగోళం సృష్టించాడని భజ్జీ పేర్కొన్నాడు. ఛాపెల్ కారణంగానే 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి రౌండ్ నుండే వెనుదిరిగిందని వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.

దేవుడికే ఆ విషయం తెలుసు:
భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా నిర్వహించే యూట్యూబ్ షో 'ఆకాష్ వాణి'లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ వచ్చిన తర్వాత బలమైన జట్టు అధ్వానంగా మారింది. అతడు ఏ ఉద్దేశంతో వచ్చాడో ఎవరికీ తెలియదు, దేవుడికే ఆ విషయం తెలుసు. పటిష్ఠమైన జట్టును ఎలా బలహీనంగా మార్చాలో అతడి కంటే గొప్పగా ఎవరికీ తెలియదనుకుంటా. తనకి కావాలిసింది వార్తల్లో వచ్చేలా చూసుకునేవాడు. విభజించు-పాలించు సూత్రంతో పనిచేశాడు. ఆ సమయంలో భారత్ క్రికెట్‌లో తప్పుడు వ్యక్తులు ఉన్నారని భావించా. జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనిపించలేదు' అని అన్నాడు.

ఛాపెల్ సృష్టించిన ప్రకంపనలతో:
'2007 వన్డే ప్రపంచకప్‌కు పటిష్ట జట్టుతో బయలుదేరాం. అయితే అప్పటికే అందరి మనసులో ఛాపెల్ సృష్టించిన ప్రకంపనలతో సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ఒకరికొకరం ఇతరులని నమ్మలేకపోయాం. జట్టుగా సంతోషంగా ఉండలేకపోవడంతో విజయాలు కరువయ్యాయి. బలమైన జట్టు ఉన్నప్పటికీ.. శ్రీలంక, బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాం. బంగ్లా, శ్రీలంకలు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వలే పటిష్ట జట్లు కావు. అయినా ఓడాం. నా క్రికెట్ కెరీర్‌లో ఈ ప్రపంచకప్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది' అని వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.

కఠిన సమయాన్ని ఎదుర్కొన్నాం:
'కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ సమయ ముగిసింది. అప్పుడు మేం ఎంతో కఠిన సమయాన్ని ఎదుర్కొన్నాం. 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచాక తిరిగి వెలుగులోకి వచ్చాం. కోచ్‌గా లాల్‌చంద్ రాజ్‌పుత్, వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్ ఇలా అందరూ మనవాళ్లే (భారత్) బాధ్యతలు చేపట్టారు. వారు జట్టు కోసం ఎంతో కష్టపడ్డారు. దీంతో జట్టులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. తిరిగి విజయాల బాట పట్టాం' అని భజ్జీ తెలిపాడు. ఛాపెల్ 2005-07 వరకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి రాకతో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఏకంగా కెప్టెన్సీని కోల్పోయాడు. అప్పడు రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టాడు.

విజేతగా నిలిచాం:
'టీ20 ప్రపంచకప్ కోసం జూనియర్ జట్టుతో దక్షిణాఫ్రికా బయలుదేరాం. రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్ప, జోగిందర్ శర్మ, యూసుఫ్ పఠాన్ కొత్త ఆటగాళ్లు. నేను, యువీ, అగార్కర్ మాత్రమే అనుభవజ్ఞులం. మిగిలినందరికీ పెద్దగా అనుభవం లేదు. ఎంఎస్ ధోనీ కూడా అప్పుడప్పుడే వెలుగులోకి వచ్చాడు. మేం ఛాంపియన్స్‌గా నిలుస్తామని ఎవరూ ఊహించి ఉండరు. కానీ మేం విజేతగా నిలిచాం. దానికి కారణం జట్టులో మంచి వాతావరణం ఉండటమే. మరో వైపు మహీ నిర్ణయాలు అమోఘం' అని హర్భజన్ వెల్లడించాడు.
'నా రిటైర్మెంట్ నా ఇష్టం.. వీడ్కోలు నిర్ణయం ఎవరో సలహాపై ఆధారపడి లేదు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications