'గేల్‌తో పోల్చితే వార్నర్‌కు బౌలింగ్ చేయడమే చాలా కష్టం'

ముంబై: వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్.. ప్రస్తుత క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. తనదైన రోజున ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. మంచినీరు తాగినంత సులువుగా సిక్స్‌లను కొట్టేసి బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. ఫార్మాట్ ఏదైనా దంచి కొట్టడమే మనోడి లక్ష్యం. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో రెచ్చిపోతాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా అత్యధిక వ్యక్తిగత స్కోర్ (66 బంతుల్లో 175) నమోదు చేశాడు.

అంత కష్టంగా అనిపించదు:
విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా కచ్చితమైన వ్యూహంతో ముందడుగు వేయాలి. లేదంటే బలిపశువు కావాల్సిందే. అయితే గేల్‌కు బౌలింగ్ చేయడం తనకు కష్టంగా అనిపించదని అంటున్నాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ఫో ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్‌లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏ విధమైన బౌలింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు అనే ప్రశ్నకు హర్భజన్ మాట్లాడుతూ... 'గేల్‌కు వేగవంతమైన బంతుల్ని సంధిస్తే వాటిని అవలీలగా సిక్స్‌లుగా మలుస్తాడు. అది కాస్త స్లోగా బంతులు వేస్తే క్రీజ్ ముందకొచ్చి ఆడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. స్లో బంతులను గేల్ సమర్ధవంతంగా ఆడలేడు' అని అన్నాడు.

వార్నర్‌కు బౌలింగ్ చేయడమే కష్టం:
'నేను ఎప్పుడూ గేల్‌కు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడలేదు. స్వీప్ షాట్లు, మిడాన్ షాట్లను గేల్ ఆడలేడు. అతడు ఈజీగా దొరికిపోతాడు' అని హర్భజన్ పేర్కొన్నాడు. పవర్‌ప్లేల్లోనూ గేల్‌కు చాలాసార్లు బంతులేశానని.. అతడు స్వీప్‌షాట్లు లేదా మిడాన్ మీదుగా షాట్లు ఆడలేడని గుర్తుచేసుకున్నాడు. ఇక వార్నర్ విషయానికొస్తే.. 'బ్యాక్‌ఫుట్‌లో బాగా ఆడతాడు. కట్ షాట్స్ కూడా బాగుంటాయి. అదే సమయంలో స్విచ్ షాట్, స్వీప్ షాట్‌లను ఆడటంలో వార్నర్ సమర్ధుడు. వార్నర్ కవర్స్ మీదుగా బంతుల్ని హిట్ చేసే విధానం బాగుంటుంది. క్రీజ్‌కు ముందుకొచ్చినా తడబాటు ఉండదు. గేల్‌తో పోలిస్తే వార్నర్‌కు బౌలింగ్ చేయడమే చాలా కష్టం' అని భజ్జీ చెప్పాడు.

ఇబ్బంది పెట్టిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లు:
ఇటీవల రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన భజ్జీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా తనపై ఆధిపత్యం చెలాయించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ గురించి వివరించాడు. అందులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల నుంచి ఒక్కో బ్యాట్స్‌మన్ ఉండగా.. పాకిస్థాన్‌లో ఇద్దరి పేర్లను వెల్లడించాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూస్ హెడెన్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్, పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ తనపై ఆధిపత్యం చెలాయించారని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications