హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ భజ్జీ చేసిన ఆ ట్వీట్ దేని గురించి అనుకుంటున్నారా? మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసిన జీఎస్టీపై. జీఎస్టీపై భజ్జీ ఏమని ట్వీట్ చేశాడంటే
'రెస్టారెంట్‌లో భోజనం చేసి బిల్ కడుతుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతోంది' అని భజ్జీ పేర్కొన్నాడు.
హర్భజన్ సింగ్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు చాలా మంది స్పందించారు. 'మీరు చెప్పింది నిజం. నేనూ అలాగే ఫీలవుతున్నాను, రెండు జీఎస్టీలు ఎందుకో అర్థం కావడంలేదు. అరుణ్ జైట్లీ దయచేసి వివరించండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు మనతో కలిసి భోజనం చేశాయి. కాకపోతే అప్పుడు విడివిడిగా' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
మరొక నెటిజన్ 'భజ్జీ.. జీఎస్టీ గురించి నువ్వన్నా ధైర్యంగా మాట్లాడగలిగావు. క్రికెటరే అలా ఫీలవుతుంటే సామాన్య పౌరుడు పరిస్థితి ఏమిటి మరి' అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హర్భజన్ సింగ్ చివరిసారిగా భారత్ తరఫున 2015లో టెస్టు, వన్డేల్లో ఆడాడు.