హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో మాటల యుద్ధంతో పాటు ట్విట్టర్‌లో కూడా ఆటగాళ్లు తమదైన శైలిలో ట్వీట్లను పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా, టీమిండియా ఆటగాళ్లు పరస్పరం తమ అభిప్రాయాలను ట్వీట్టర్‌లో వెల్లడిస్తున్నారు. బెంగుళూరు టెస్టులో టీమిండియా 75 పరుగుల తేడాతో ఆసీస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేయడంతో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కౌంటర్ ట్వీట్ చేశాడు.
తొలి టెస్టులో టీమిండియా ఓటమిని గుర్తు చేస్తూ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన ట్వీట్‌కు ప్రతీకారంగా హర్భజన్ సింగ్ ఫోటోతో సమాధానమిచ్చాడు. ఈ ఫోటోలో భజ్జీ తన నోటిపై వేలు పెట్టుకుని ఉండటం విశేషం. బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో 'వెల్‌డెన్ మై బాయిస్, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి' అని కామెంట్ కూడా పెట్టాడు.
వివరాల్లోకి వెళితే టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగానే ఇంత చెత్త జట్టును ఎప్పుడూ చూడలేదని భారత్ ఖచ్చితంగా 4-0 క్లీన్ స్వీప్‌చేస్తుందని తెలిపాడు. అయితే భారత్ అనుహ్యంగా పుణే టెస్టులో 333 పరుగులు తేడాతో ఓడిపోవడంతో వార్నర్, ఆసీస్ అభిమానులు బజ్జీ అన్న మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు.
కాగా, బెంగుళూరు టెస్టులో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమమైంది.
బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు.
భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా ఉమేశ్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.