Harbhajan Singh: ఒకవేళ యువరాజ్ సింగ్ కెప్టెన్ అయితే మామూలుగా ఉండేది కాదు, ఆసక్తికర విషయాలు చెప్పిన భజ్జీ

హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ పంజాబ్ రాష్ట్రం నుంచి టీమిండియాకు ఎంపికై భారత జట్టు తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు క్రికెటర్లు. వీరిద్దరు గ్రౌండ్లోనే కాదు మైదానం బయట కూడా మంచి స్నేహితులు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా జట్టులో నిలదొక్కుకున్నారు. టీమిండియాకు సుదీర్ఘకాలం ఆడారు. అనేక సార్లు వీరిద్దరు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలను అందించారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా ధోనీ కెప్టెన్సీలో అందుకున్న సంగతి తెలిసిందే.
ఆ రెండు సార్లు టీమిండియాకు కీలక ప్లేయర్లుగా వీరు నిలిచారు. యువరాజ్ 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక కెరీర్లో 304వన్డేలు ఆడిన యువరాజ్ సింగ్ 14సెంచరీలు, 52హాఫ్ సెంచరీలతో 8701పరుగులు చేశాడు. హర్భజన్ సింగ్ టెస్ట్ కెరీర్లో 103 మ్యాచ్‌లు ఆడి 417వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో 236 మ్యాచ్‌లు ఆడి 269వికెట్లు తీశాడు. అతని కెరీర్ బెస్ట్ 5/31గా ఉంది.

మేం తొందరగా మేల్కోవాల్సి వచ్చేది
ఇటీవల హర్భజన్‌ను స్పోర్ట్స్‌కీడా మీడియా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు హర్భజన్ కూడా చాలా చమత్కారంగా జవాబిచ్చాడు. యువరాజ్ సింగ్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదనే ప్రశ్నకు హర్భజన్ స్పందిస్తూ.. 'యువరాజ్ సింగ్ భారత కెప్టెన్‌గా ఉండి ఉంటే.. ఏం జరిగేది. మేము మరింత త్వరగా నిద్రపోవాల్సి వచ్చేది. అలాగే మరింత త్వరగా మేల్కోవాల్సి వచ్చేది. మేము మరింత కష్టపడి పనిచేయాల్సి ఉండేది. అతను గొప్ప కెప్టెన్‌గా కొనసాగేవాడు. అలాగే బాగా స్ట్రిక్ట్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతను గొప్ప కెప్టెన్ అవుతాడని చెప్పడానికి 2011ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను గెలుచుకున్న అతని రికార్డులే ఇందుకు నిదర్శనం' అని భజ్జీ చెప్పాడు.

ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు
ఇకపోతే యువరాజ్ కెప్టెన్‌గా ఉంటే కొంతమంది ఆటగాళ్ల కెరీర్‌లు అతని మద్దతు ద్వారా మరింత ఎక్కువ కాలం కొనసాగేవా అనే ప్రశ్నకు హర్భజన్ ఖరాఖండిగా జవాబులిచ్చాడు. మా తరం ఆటగాళ్లు అందరూ మెరిట్ ఆధారంగా దేశం కోసం క్రికెట్ ఆడినవారేనని చెప్పాడు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల జట్టులో కొనసాగలేదని హర్భజన్ చెప్పాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనే అతని స్థానాన్ని నిర్ణయిస్తుందని, ఇందులో కెప్టెన్ ప్రమేయం అంతగా ఉండదని భజ్జీ స్పష్టం చేశాడు.

కెప్టెన్‌గా ఉంటే దేశమే ముందు.. స్నేహం తర్వాత
ఈ విషయమై హర్భజన్ మాట్లాడుతూ.. 'యువరాజ్ కెప్టెన్‌గా ఉంటే మా కెరీర్‌లు మరింత కాలం కొనసాగేవని నేను అనుకోను. ఎందుకంటే మేం ఏది ఆడినా మా శక్తిసామర్థ్యాల మేరకే ఆడాం. ఏ కెప్టెన్ కూడా మమ్మల్ని తొలగించకుండా రక్షించలేదు. మా ఆటే మమ్మల్ని జట్టులో ఉంచాలో, తీసేయాలో నిర్ణయిస్తుంది. ఇక దేశ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎవరైనా సరే స్నేహాన్ని పక్కనపెట్టి ముందు దేశం గురించి ఆలోచించాలి' అని హర్భజన్ అన్నాడు. ఇకపోతే హర్భజన్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications