టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మూడు సిక్సర్లు.. హర్భజన్ పశ్చాతాపం!!

ముంబై: దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని యువ భారత్.. మెగా టోర్నీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి టైటిల్ ఒడిసిపట్టింది. టోర్నీలో భాగంగా లీగ్ దశలో పాకిస్తాన్‌పై సాధించిన విజయం (బౌలౌట్) ప్రత్యేకంగా.. ఇక ఫైనల్లోనూ దాయాది జట్టుపై పోరాటం మరువలేనిది. ఫైనల్లో ఎన్నో అనూహ్య మలుపుల తర్వాత టీమిండియా విజేతగా నిలిచింది. అయితే లాక్‌డౌన్ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ గుర్తుచేసుకుని పశ్చాతాపం చెందాడు.

ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు:
158 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో (24 బంతుల్లో) 53 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్ వేసిన హర్భజన్ సింగ్ లయ తప్పి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మిస్బావుల్ హక్ భారత్‌కి చెమటలు పట్టించేశాడు. భజ్జీ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాది ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 18 బంతుల్లో 34 పరుగులుగా మారిపోయింది. మ్యాచ్ పాక్ చేతుల్లోకి వెళ్ళింది. మిస్బావుల్ హక్ (43: 38 బంతుల్లో 4x6) క్రీజులో ఉండడంతో పాక్ విజయంపై నమ్మకంగా ఉంది. ఇక చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమవగా.. ఆరంభంలోనే ఒక సిక్స్ ఇచ్చిన జోగిందర్ శర్మ నాలుగో బంతికి మిస్బాని ఔట్ చేశాడు.

నాపై ఒత్తిడి పెరిగింది:
ఓకే ఓవర్‌లో మూడు సిక్సర్లు సమర్పించుకోవడంను తాజాగా హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో షో క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ మాట్లాడుతూ... 'మిస్బా ఒక సిక్స్ కొట్టగానే నాపై ఒత్తిడి పెరిగింది. తర్వాత బంతిని ఎలా విసిరాలి అనేదానికంటే వేగంగా ఓవర్‌ని పూర్తి చేయాలనుకున్నా. ఆ క్రమంలో యార్కర్ బంతుల్ని కూడా సంధించా' అని తెలిపాడు. బ్యాట్స్‌మన్ ఎవరైనా సిక్స్ లేదా రెండు సిక్సర్లు లేదా మూడు సిక్సర్లు కొట్టవచ్చు కానీ కీలక సమయంలో అలా పరుగులు ఇవ్వడం సరైంది కాదని భజ్జీ పశ్చాతాపం చెందాడు.

మరింత శ్రద్ధతో బౌలింగ్ చేసుంటే:
టీ20 ప్రపంచకప్‌లో అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌లోని ఆరు బంతుల్నీ యార్కర్లుగా విసిరాను. అప్పుడు ఆసీస్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. దాంతో ఆ ప్లాన్‌నే పాక్‌పైనా అమలు చేశాను. కానీ అది పనిచేలేదు. అప్పుడు కొంచెం ఆలోచించి ఉండాల్సింది. మరింత శ్రద్ధతో బౌలింగ్ చేసుంటే బాగుండేది' అని హర్భజన్ సింగ్ పేరొన్నాడు. జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో మూడో బంతికి మిస్బా భారీ షాట్ ఆడి.. బౌండరీ వద్ద శ్రీశాంత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ పొట్టి క్రికెట్‌లో తొలి ఛాంపియన్‌గా నిలిచింది.

5 పరుగుల తేడాతో విజయం:
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ (75) టాప్ స్కోరర్. అనంతరం పాక్ 19.3 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో ఎలాంటి అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్‌కు వెళ్లిన భారత యువ జట్టు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications