
హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదంపై భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ట్యాంపరింగ్‌కు పాల్పడిన వివాదానికి తనదైన శైలిలో స్పందించాడు. తప్పు చేశారని తేలినా ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్ క్రాఫ్ట్‌పై నిషేధం విధించడానికి ఆస్ట్రేలియా క్రికెట్ ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించాడు.
గతంలో తమ జట్టు కేవలం మోతాదుకు మించి అప్పీల్ చేశామన్న కారణంగా ఆరుగురు ఆటగాళ్లపై వేటు వేసిన విషయం గుర్తు చేశాడు. మంకీ గేట్ వివాదంలో ఏ తప్పుడు చేయకున్నా తనకు శిక్ష విధించారని ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాడు. కానీ కొన్ని రోజుల్లోనే హర్భజన్ తన మనసు మార్చుకుని ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు మద్ధతు తెలిపాడు.
తప్పు చేశారని తేలితే కేవలం ఒకటి లేక రెండు సిరీస్‌లకు పక్కన పెడితే సరిపోతుందని, కానీ ఆటగాళ్లను ఏడాదిపాటు ఆటకు దూరం చేయడం చాలా పెద్దశిక్షేనని ఆసీస్ క్రికెటర్లకు విధించిన నిషేధం నిర్ణయాన్ని హర్భజన్ వ్యతిరేకించాడు.
'కేవలం బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్న కారణంగా ఏడాదిపాటు నిషేధం విధించడం జోక్. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు. ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలంటూ' హర్భజన్ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశాడు.